హైదరాబాద్, సెప్టెంబర్ 28: ‘పైండ్లెన పేదింటి ఆడబిడ్డకు రూ. లక్ష నగదుతో పాటు ఇందిరమ్మ కానుక కింద తులం బంగారాన్ని ఇస్తామ’ని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మాటతప్పారు. అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నప్పటికీ, తులం బంగారం హామీని ఇంతవరకూ నెరవేర్చలేదు. అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు. ‘తాయి మామన్ తంగ మోతిరమ్ తిట్టమ్’ స్కీమ్ కింద ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ప్రతీ నవజాత శిశువుకు గ్రాము విలువ గల బంగారు ఉంగరాన్ని ఇస్తామని ఎన్నికల్లో విజయ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ఇప్పుడు ఆ హామీని ఆయన నెరవేర్చారు.
సోమవారం మదురైలోని ప్రభుత్వ రాజాజీ దవాఖానలో ఈ పథకాన్ని ప్రారంభించిన విజయ్ శిశువులను కాసేపు ఎత్తుకుని వారికి బంగారు ఉంగరాలను అందచేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.755.83 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ దవాఖానల్లో స్థానిక తల్లులకు జన్మించే శిశువుల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ప్రారంభ దశ అమలు నిమిత్తం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను సేకరించింది. ఈ ఏడాది జూన్ 22న లేదా ఆ తర్వాత జన్మించే అర్హులైన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం తయారీ ఖర్చులు, జీఎస్టీ మినహాయించి 22 క్యారెట్ల బంగారు ఉంగరం ధర సుమారు రూ.14,000 ఉంటుంది.
తమిళనాడులో ఎన్నికల హామీలు జెట్ స్పీడ్‌తో అమల్లోకి వస్తుంటే, తెలంగాణలో మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు మరో 420 హామీల్లో పట్టుమని పదింటిని కూడా కాంగ్రెస్ సర్కారు అమల్లోకి తీసుకురాలేదు. ‘తులం బంగారం’ హామీ విషయానికి వస్తే, రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకూ 4,30,293 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఈ లెక్కన ఒక్కొక్కరికి తులం బంగారం చొప్పున లెక్కేసుకొంటే.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకూ 4,303 కిలోల బంగారాన్ని (రూ. 66,980 కోట్లు) బాకీ పడినట్టు అర్థమవుతున్నది. పదవీకాలం సగానికంటే ఎక్కువగా పూర్తైనప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ సర్కార్‌పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.