రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివారులో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన ప్లాట్లు, భూములు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని జాబితా నుంచి తొలగించాలంటూ బాధితులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు 22ఏ నిషేధిత జాబితాపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండాపోయింది. జాబితాలో తప్పులుంటే వెంటనే సవరిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
రంగారెడ్డి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ గ్రామంలో 597, 599, 615, 616, 617, 618 సర్వేనంబర్లు అధికారులు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ సర్వేనంబర్లు పూర్తిగా తమ పట్టా భూములని, ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతు మర్రి సురేందర్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాలాపూర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నామని, తహసీల్దార్ విచారణ జరిపిన తర్వాత భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, నివేదిక తయారు చేసి ఆర్డీవోకు అందజేశారు. ఆర్డీవో కూడా జాబితా నుంచి తొలగించాలని మరో నివేదికను కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. కలెక్టర్ కార్యాలయంలో తీవ్ర జాప్యం జరిగి తమకు ఎన్వోసీ రావడంలేదని వెంటనే తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఎన్వోసీ అందజేయాలని నాదర్గుల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కోరుతున్నారు.
ఆందోళనలో ప్లాట్ల యజమానులు
హైదరాబాద్ శివారులో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుర్కయంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, పెద్దఅంబర్‌పేట, గండిపేట్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారు. తాము అప్పులు చేసి, ప్లాట్లు కొనుగోలు చేశామని, వాటిని నిషేధిత జాబితాలో చేర్చి తాము అమ్ముకోకుండా చేశారని లబోదిబోమంటున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఎస్ఆర్వో కార్యాలయానికి వెళ్లిన వారికి నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎస్ఆర్వోలు మాత్రం జాబితా నుంచి తొలగించినట్టు ఎన్వోసీ తీసుకుని వస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్తున్నట్టు బాధితులు తెలిపారు.
కలెక్టరేట్‌కు ఫిర్యాదుల వెల్లువ..
తమ భూములు, ప్లాట్లను అకారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, వాటిని జాబితా నుంచి తొలగించాలంటూ తహసీల్దార్ కార్యాలయాలకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంతోపాటు డివిజన్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజావాణికి బాధితులు క్యూ కడుతున్నారు. తమ ఆస్తులను జాబితా నుంచి తొలగించాలంటే తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ, తమ పిల్లల పెండ్లిళ్ల కోసం ప్లాట్లు, పొలాలు అమ్ముకుందామంటే ఎన్వోసీ కావాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎన్వోసీలు రావడంలేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం నిషేధిత జాబితాపై పునరాలోచించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.