RBI : ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserv Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటు (Repo rate) ను 25 బేసిస్ పాయింట్లు (25 Basis Points) పెంచింది. దాంతో రెపోరేటు 5.50 శాతానికి చేరింది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుకు హౌసింగ్, వెహికల్ లేదా ఇతర స్థిరాస్తి లోన్ తీసుకున్నవారిపై వడ్డీ భారం పడనుంది. ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలో మూడు రోజులపాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటుతోపాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటును 5.75 శాతానికి పెంచారు.
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. దాంతో పలు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జూలైలో ఇది 4.45 శాతంగా ఉంది. అదేవిధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి.
అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, క్రూడ్ ధరలు ఎగబాకడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడంతో రెపోరేటును యథాతథంగా ఉంచే అవకాశం తగ్గిందని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఫిబ్రవరి 2023 తర్వాత తొలిసారి రెపోరేటు పెరగవచ్చని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతానికి చేరుతున్న నేపథ్యంలో రానున్న సమావేశాల్లోనూ కఠిన నిర్ణయాలు ఉండవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ పేర్కొన్నది.
పెరిగిన వడ్డీ భారం మీ లోన్‌పై ఏవిధంగా ప్రభావితం చూపుతుంది?
ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుకు హౌసింగ్, వెహికల్ లేదా ఇతర స్థిరాస్తి లోన్ తీసుకున్నవారిపై వడ్డీ భారం పడనుంది. ఈ వడ్డీ భారాన్ని ఆయా బ్యాంకులు రెండు రకాలుగా వినియోగదారునిపై వేయనున్నాయి. నేరుగా ఈఎంఐపైన వేస్తే మీరు చెల్లించే నెలవారి ఈఎంఐ పెరుగుతుంది. అలా కాకుండా లోన్ కాలవ్యవధి పైన కూడా వేయవచ్చు. అంటే.. ఈఎంఐలో తేడా రాకుండగ మొత్తం లోన్ చెల్లించే కాల వ్యవధి పెరుగుతుంది. బ్యాంకును సంప్రదించి ఈ రెండింటిలో ఏది మీకు వర్తించింది అనేది తెలుసుకోవచ్చు. ఈఎంఐ పెంచుకోవడం మంచిదా? లేక లోన్ కాలవ్యవధి పెంచుకుంటే మంచిదా అనేది ఆర్థిక నిపుణులను అడిగి తెలుసుకోవాలి.