Malreddy Rangareddy | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంత ఉపయోగపడుతోందని తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. ఓ విద్యార్థినితో ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. పథకం వల్ల ఏడాదికి రూ.45 వేల వరకు ఆదా అవుతోందని ఆ యువతి చెబుతుండగానే.. ఎమ్మెల్యే ఆమె చేయిని పలుమార్లు పట్టుకోవడం, తాకడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నదో స్వయంగా తెలుసుకునేందుకు మంగళవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో బస్సులో నిలబడి ఉన్న ఓ విద్యార్థినిని పలకరించి.. పథకం ద్వారా ఆమెకు కలుగుతున్న ప్రయోజనాలను అడిగారు.
దీనికి విద్యార్థిని స్పందిస్తూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల కాలేజీకి వెళ్లేందుకు అయ్యే ఖర్చు పూర్తిగా ఆదా అవుతోందని చెప్పింది. ఏడాదికి దాదాపు రూ.45 వేల వరకు ప్రయాణ ఖర్చు మిగులుతోందని సంతోషంగా వివరించింది. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదానికి కారణమైంది. విద్యార్థినితో సంభాషణ కొనసాగుతుండగా ఆమె చేయిని ఎమ్మెల్యే పలుమార్లు పట్టుకోవడం, తాకడం వీడియోలో రికార్డయింది. ఎమ్మెల్యే స్పర్శకు ఆమె అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలో కనిపించగా.. తన చేయిని వెనక్కి తీసుకునేందుకు, పక్కకు తప్పుకునేందుకు ఆమె పలుమార్లు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో కనిపించింది.
ఆర్టీసీ బస్సులో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
మనవరాలి వయసున్న పిల్లలతో కనీస స్పృహ లేకుండా హద్దుమీరి ప్రవర్తించిన మల్రెడ్డి రంగారెడ్డి
ఇలాంటి ప్రవర్తనతో కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోంది?
సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మల్రెడ్డి రంగారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం!
— BRS Party (@BRSparty) October 7, 2026
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజాప్రతినిధిగా ఉన్న సీనియర్ నాయకుడు యువతితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళల వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ కూడా ఘాటుగా స్పందించింది. ఇలాంటి ప్రవర్తనతో కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోందని ప్రశ్నించింది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించి మల్రెడ్డి రంగారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.