UNGA : ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరోసారి మండిపడింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ చర్యల్ని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశాలు ఇటీవల అమెరికా, న్యూయార్క్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 81వ ఐరాస సాధారణ అసెంబ్లీ ఆరవ కమిటీ సమావేశం జరుగుతోంది. దీనికి ఇండియా కూడా హాజరైంది.
ఇండియా తరఫున బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విప్లవ్ కుమార్ దేవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సరిహద్దు తీవ్రవాదాన్ని భారత్ ఖండిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తానే కారణం అన్నారు. సరిహద్దు వెంట ఉగ్రవాద సంస్థల కోసం ప్రత్యేక క్యాంపుల్ని పాకిస్తాన్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులకు జవాబుదారీ తనం కావాలని, అంతర్జాతీయంగా చట్టపరమైన విధానం ఉండాలని దేవ్ సూచించారు. తీవ్రవాదానికి మద్దతు, ఆర్థిక వనరుల సమీకరణ, సంస్థలు, కుట్రలు, చొరబాట్లు వంటి వన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. పహల్గాంలో జరిగిన దాడి సరిహద్దు తీవ్రవాదానికి నిదర్శనం అన్నారు. ఈ దాడిలో 26 మంది మరణించారని తెలిపారు. ఈ ఘటనకు పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ ఏ తైబా సంస్థ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం పాకిస్తాన్ అని ఐరాస సభలో మరోసారి ఇండియా చాటిచెప్పింది.