హత్నూర, అక్టోబర్ 7 : కరెంటు కోతలతో విసుగు చెందిన రైతన్నలు కన్నెర్ర చేశారు. రోడ్డు ఎక్కితే నైనా తమ సమస్య పరిష్కారం అవుతుందో ఏమోనని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్దకు చేరుకొని ఆందోళన బాట పట్టారు. ఒకే మండలంలో రెండు ప్రాంతలల్లో సబ్ స్టేషన్ ల వద్ద ఆందోళన చేసిన రైతులు తమ గోడును వెళ్లబుచ్చు కుంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పంటలు కళ్లముందు ఎండుతున్న ప్రభుత్వానికి పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే బుధవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన రైతులు వడ్డేపల్లి విద్యుత్ సబ్స్టేషన్, అదేవిధంగా తెల్ల రాళ్ల తండాకు చెందిన గిరిజన రైతులు సిరిపురం సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
పంటలకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర విద్యుత్ వల్ల తమ చేతికి వచ్చిన వరి పంటలు ఎండుతున్నాయని, లో వోల్టేజీ సమస్యతో బోరు మోటర్లు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కరెంటును లోవోల్టేజిగా ఇస్తుండటంతో బోరు మోటర్లు కాలిపోయి నష్టపోతున్నామని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఓవైపు వ్యవసాయానికి 12 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే వస్తుందని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఇంతటి దుస్థితి ఎదురు కాలేదని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
పంట సాగు చేసిన నాటినుండి రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదని అన్ని రకాలుగా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రెడ్డి ఫోన్లో విద్యుత్ శాఖ సీఎండీతో విద్యుత్ సమస్యపై మాట్లాడినట్లు రైతులు తెలిపారు. ఇకమీదట రైతులకు సరిపోను కరెంటు సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ ఏడిఈ శ్రీనివాస్, జిన్నారం సీఐ రమణారెడ్డి, ఏఈ రాఘవలు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
