సూర్యాపేట, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రైతాంగానికి రేవంత్ సర్కార్ మరో నడ్డి విరిగే వార్త చెప్పింది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీఏసీఎస్, ఏఆర్ఎస్కేల నుంచి విక్రయాలు చేసే యూరియాకు రవాణా చార్జీలను ప్రభుత్వమే భరించి ఎమ్మార్పీలకు విక్రయించగా, నేడు రవాణా చార్జీలను రద్దు చేస్తూ వాటిని రైతుల నుంచే వసూలు చేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. సహకార సంస్థలతో ప్రభుత్వమే రవాణా చార్జీ వసూలు చేయిస్తే తాము మాత్రం ఎందుకు నష్టపోవాలి, మేం కూడా రవాణా చార్జీలు వసూలు చేస్తామని ప్రైవేట్ డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై అదనంగా దాదాపు 30 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల బాధలు చెప్పనలవి కాకుండా ఉండేవి. అప్పులు చేసి సాగు చేస్తే నీళ్లు లేక, విద్యుత్ రాక, ఎరువులు దొరక్క నానా కష్టాలుపడి అంతో ఇంతో పండిస్తే అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయించి అప్పుల పాలై వందలు, వేలుగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా నాటి ప్రభుత్వాలు కనికరం చూపలేదు. అలాంటిది తెలంగాణ సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే పెట్టుబడి సాయం మొదలుకొని అన్నీ ఇవ్వడంతో 2018 నుంచి 2023 వరకు రెండు పంటలను సమృద్ధిగా పండించి కాలుమీద కాలు వేసుకొని దర్జాగా జీవనం సాగిస్తుండగా, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లుగా మళ్లీ ఉమ్మడి రాష్ట్ర కష్టాలు పునరావృతం అవుతున్నాయి. నీళ్లు పోయినై.. విద్యుత్ రాట్లేదు.. ఇస్తానన్న బోనస్ ఇవ్వలేదు.. రైతుబంధుకు మంగళ పాడింది.. పంట కొనడంలేదు..
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఫోన్ చేస్తే టౌన్, మండల కేంద్రాల్లో ఉండే ఆటోల్లోనే రైతు ఇంటికి యూరియా చేరగా, ఎరువులకు మళ్లీ క్యూలైన్లు దర్శనమివ్వడమే కాదు, గత సంవత్సరం యూరియా పూర్తిస్థాయిలో బ్లాక్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో దేశంలో ఎక్కడే లేని విధంగా గత ఏడాది నుంచి యూరియా యాప్ ద్వారా సరఫరా చేస్త్తోంది. అయితే ఈ సరఫరా మండల యూనిట్‌గా పెట్టడంతో మండలంలో యూరియా కావాలనుకునే రైతులు సదరు యాప్ ఓపెన్ చేస్తే ఎక్కడ యూరియా నిల్వలు ఉంటే అక్కడ కనిపిస్తుంది. దాని ఆధారంగా బుక్ చేసుకొని యూరియా తీసుకొని వెళుతున్నారు. దీంతో రైతులకు ఎప్పుడు ఎక్కడికి వెళ్లి యూరియా తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా, తాజాగా రైతులకు యూరియాపై రవాణా చార్జీని ఎత్తి వేసింది.
జిల్లాలో యూరియా వినియోగం
వ్యవసాయశాఖ రికార్డుల ప్రకారం పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాకు సీజన్ ఒక్కింటికి దాదాపు 55 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుండగా, నల్లగొండ 75 వేలు, యాదాద్రి 40 వేలుగా ఉంటుంది. ఒక్కో బస్తా 45 కిలోల చొప్పున ఉంటుండటంతో, ఈ లెక్కన సీజన్ ఒక్కింటికి 37,40,000 బస్తాలు ఒక సీజన్‌కు అవసరం ఉండగా, ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి దాదాపు 74,80,000 బస్తాలను రైతులు వినియోగిస్తున్నారు. రవాణా విషయానికి వస్తే ప్రస్తుతం బస్తా ఒక్కింటికి రూ.30 నుంచి 50లు చార్జీ పడుతుండగా, యావరేజ్‌గా రూ.40లు చెల్లిస్తే 74,80,000 బస్తాలకు రైతులపై రూ.29.92 కోట్ల అదనపు భారం పడనుంది. యూరియా రవాణా చార్జీలను రైతుల నుండే వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం యూరియా బస్తాకు ఒక బిల్లు, అలాగే రవాణా చార్జీలకు మరో బిల్లు, ఇలా రెండు బిల్లులు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. తక్షణమే యూరియా రైతులపై వేసే రవాణా భారాన్ని రద్దు చేసి పాత విధానంలోనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మేం ఎందుకు నష్టపోవాలి?
ప్రభుత్వమే భరించాల్సిన యూరియా రవాణా చార్జీలను రద్దు చేయడంతో ఇక మీదట ఏటా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులపై దాదాపు రూ.30 కోట్లకు పైనే అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో అందజేసే యూరియాను ఆయా కంపెనీలు కేటాయింపుల ఆధారంగా మిర్యాలగూడ మార్క్‌ఫెడ్‌కు 60 శాతం ఇస్తుండగా, 40 శాతం హోల్‌సేల్ డీలర్లకు సరఫరా చేస్తుంది. అయితే మార్క్‌ఫెడ్ సరఫరా చేసే వాటిలో ప్రధానంగా ఏఆర్ఎస్కే, పీఏసీఎస్‌లు ఉంటాయి. వీటికి ప్రభుత్వం రవాణా చార్జీలు భరిస్తుండగా ఎమ్మార్పీ ధరలకే రైతులకు ఆయా సంఘాల నిర్వాహకులు బస్తా ఒక్కంటికి రూ.266లకు ఇచ్చే వారు. అయితే ప్రభుత్వం రవాణా చార్జీలు ఎత్తివేయడంతో పీఏసీఎస్‌లు, ఏఆర్ఎస్కేలతో పాటు హోల్‌సేల్ డీలర్లు, అలాగే రైతు సంఘాలకు చెందిన వారు సైతం ప్రభుత్వమే రవాణా చార్జీలు వసూలు చేయాలనడంతో “మేము మాత్రం ఎందుకు నష్టపోవాలి? మేము కూడా రవాణా చార్జీలను వసూలు చేస్తామని” అంటున్నారు.