Kaleshwaram Project | హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ) : రెండేండ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్‌లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్ వద్ద ఇసుక మేటలను తొలగించే పనులకు సిద్ధమైంది. అయితే మరమ్మతుల పేరుతో మార్గదర్శకాలకు విరుద్ధంగా పూడికతీస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నా సాగునీటిరంగ నిపుణులు మాత్రం పలు అంశాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైడ్రాలిక్ నిర్మాణాలైన బరాజ్‌ల ఎగువ, దిగువన 500 మీటర్ల వరకూ ఎలాంటి పూడికతీయవద్దని పర్యావరణ శాఖ ప్రత్యేక నిబంధనలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తవ్వకాల విషయంలో ఆదమరిస్తే బరాజ్‌ల ఉనికికే పెను ప్రమాదంగా పరిణమిస్తుందని తేల్చిచెబుతున్నారు.
కాళేశ్వరం బరాజ్‌ల వద్ద భారీగా ఇసుక మేటలు వేశాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మేడిగడ్డ మొదలు సుందిళ్ల వరకు, ఎగువన ఎల్లంపల్లి సైతం ఎప్పుడూ నిండుగా జలాలతో కళకళలాడాయి. ఈ క్రమంలో ఇసుక తోడివేత దాదాపు ఐదేండ్ల పాటు అంతంతమాత్రంగానే కొనసాగింది. దీంతో ఎల్లంపల్లి ఎగువన, దిగువన మేడిగడ్డ వరకు ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఒక్క మేడిగడ్డ వద్దనే దాదాపు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టు గతంలో తేల్చిన టీజీఎండీసీ, వీటి విలువ రూ.1,000కోట్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పరిధిలో ఇసుక బ్లాక్‌లను వేలం వేసింది. అన్నారం బరాజ్ వద్ద 5 లక్షల మెట్రిక్ టన్నులు, సుందిళ్ల బరాజ్ వద్ద కూడా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఇసుక మేటలున్నట్టు నిర్ధారించారు. మొత్తంగా 3 బరాజ్‌ల ద్వారానే ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఇసుక తీసేందుకు టీజీఎండీసీ ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన క్రమంలో తాజాగా అన్నారం బరాజ్ వద్ద పనులు చేపట్టింది. అయితే ఈ ప్రక్రియలో పూర్తిగా పర్యావరణ శాఖ మార్గదర్శకాలకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాంకేతిక పరీక్షలను సాకుగా చూపుతూ నిబంధనలకు పాతరేసి బరాజ్‌లకు మరింత ముప్పు తెచ్చిపెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మైనింగ్ విషయంలో పర్యావరణ నిబంధనలను సాగునీటి రంగ నిపుణులు ఉటంకిస్తున్నారు. దేశంలో ఇసుక మైనింగ్‌పై 2016లో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్ధిష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. హైడ్రాలిక్ నిర్మాణాల వద్ద అంటే బరాజ్‌లు, వంతెనలు, ఇన్‌టేక్ పాయింట్ల వద్ద 200-500 మీటర్ల మేర ఎలాంటి తవ్వకాలను చేపట్టకూడదు. అంతకుమించి నిర్మాణాల వద్దనైతే ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఇక బరాజ్‌లకు ఎగువ, దిగువన 500 మీటర్ల లోపల ఇసుక తొలగింపును నిషేధించింది. బరాజ్ రక్షణలో కీలకమైన ఆఫ్రాన్ నిర్మాణం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను తొలగించకూడదు.
అదీగాక ప్రాజెక్టు వద్దకు భారీ యంత్రాలు, వాహనాలకు సైతం అనుమతివ్వకూడదు. మాన్యువల్ పద్ధతిలోనే ఇసుకను తవ్వి, ట్రాక్టర్ల ద్వారా డంప్‌యార్డులకు తరలించాలి. ఇసుక తొలగింపు ప్రక్రియను సైతం నిర్దేశిత కమిటీ, ఇరిగేషన్‌శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగాలి. కానీ అన్నారం బరాజ్ వద్ద ఈ నిబంధనలన్నింటికీ పాతరేశారని ఆరోపణలున్నాయి. అయితే ఇసుక తొలగింపు వల్ల బరాజ్ నిర్మాణానికి ఎలాంటి నష్టం లేదని, అది పూర్తిగా పియర్స్, ఫ్లోర్ భాగాల పరీక్షల కోసమేనని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ ఇసుక తవ్వకాల వీడియోలు బయటకు పొక్కగానే బరాజ్ ప్రాంతం నుంచి జేసీబీలు, లారీలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో మాత్రం సమాధానమివ్వలేదు. పరీక్షలకు సంబంధించి ఆధారాలను బయటపెట్టకుండా బుకాయింపులకు దిగడం ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది.
ఇరిగేషన్‌శాఖ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనల ప్రకారం జాగ్రత్తగా ఇసుక తీయాలని సాగునీటి నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరాజ్ ఆఫ్రాన్ ప్రాంతాల్లో జాగ్రత్తగా పర్యవేక్షించాలని, ఏమాత్రం అలక్ష్యం చేసినా ప్రాజెక్టులు ప్రమాదం పడుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాబోయే రోజుల్లో సంబంధిత ఇంజినీర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనులు రెండేండ్లు జాప్యమైందని, ఇకనైనా ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు సాంకేతిక పరీక్షలను పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని ఇరిగేషన్ శాఖ అధికారులను, ప్రభుత్వాన్ని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.