– రాయలసీమకు నీటి తరలింపుపై మౌనం
– తెలంగాణ రైతులకు మాత్రం నీటి కష్టాలా?
– రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
– హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి
గరిడేపల్లి, ఆగస్టు 14 : వర్షాభావ పరిస్థితులతో సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించక పోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఒకవైపు శ్రీశైలం–పోతిరెడ్డిపాడు మార్గం ద్వారా రాయలసీమకు నీటి తరలింపు జరుగుతోందని ఆరోపణలు వస్తున్నా మరోవైపు తెలంగాణ రైతుల పంటలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక బోర్లు, బావులు ఎండిపోయి రైతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్ ఎడమ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. అక్కడికి నీళ్లు ఇక్కడికి కన్నీళ్లు ఎందుకు అని ప్రశ్నించిన ఆయన, ఎడమ కాల్వ కింద ఉన్న తెలంగాణ రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటి విడుదల ఆలస్యమైతే ఇప్పటికే నాట్లు వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
కాల్వకు విడతల వారీగా నీటిని విడుదల చేసి చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీరు, పశువుల నీటి సమస్యలు కూడా కొంతవరకు తీరుతాయని పేర్కొన్నారు. రైతుల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా అత్యవసర సమస్యగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోతే రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కడియం స్వప్న వెంకటరెడ్డి, పెండెం వీరయ్యగౌడ్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, పెండెం ధనయగౌడ్, వెంకటరాముడు గౌడ్, అమరగాని వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాని సైదులు ముదిరాజ్, శేషిరెడ్డి, రాజ్ మహమ్మద్, గోపాల్, మామిడి కాశయ్య, అంజయ్య, రెబ్బ శివ, వేణు, పిట్ట నర్సయ్య, చిట్యాల లింగయ్య, పెండెం శ్రీను, పెండెం వినోద్, పెండెం శంకర్ పాల్గొన్నారు.