హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న రైతులకు ఊహించని షాక్ తగిలింది. వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తు కొనుగోలులో యూనిట్‌కు 6 పైసల చొప్పున కోతపెట్టారు. గతంలో యూనిట్ విద్యుత్తుకు రూ.3.13గా ఉన్న కొనుగోలు ధరను తాజాగా రూ.3.07కు తగ్గించారు. ఈ మేరకు ఈఆర్సీ తాజాగా ఆర్డర్ పాస్ చేసింది. దీనిపై రైతులు గగ్గోలు పెడుతూ హైకోర్టును ఆశ్రయించారు.
డిస్కమ్‌ల పిటిషన్ తిరస్కరణ
పీఎం కుసుమ్ కాంపోనెంట్-ఏ పథకం కింద రాష్ట్రంలోని రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి, వెయ్యి మెగావాట్లకుపైగా సోలార్ ప్లాంట్లు నెలకొల్పారు. వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు కొనుగోలు చేస్తామన్నాయి. ఈ మేరకు రైతులతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కూడా కుదుర్చుకున్నాయి. దీంతో ఈఆర్సీ తొలుత యూనిట్‌కు రూ.3.13 కొనుగోలు ధరను ఖరారు చేసింది. తీరా రైతులు రూ.కోట్లు వెచ్చించి ప్లాంట్లు పెట్టిన తర్వాత డిస్కమ్‌లు మెలికపెట్టాయి. సోలార్ ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి కుదించినందున ప్రాజెక్ట్ వ్యయం తగ్గిందని, అందువల్ల విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు 15 పైసలు చొప్పున తగ్గించి రూ.2.98గా ఖరారు చేయాలని డిస్కమ్‌లు ఈఆర్సీకి పిటిషన్‌ను సమర్పించాయి. దీనిపై విచారణ జరిపిన ఈఆర్సీ.. టారిఫ్‌ను రూ.2.98కు తగ్గించే ప్రసక్తే లేదంటూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
చెరిసగం ప్రయోజనం
జీఎస్టీ రేటు తగ్గడాన్ని ‘చేంజ్ ఇన్ లా’ ఈవెంట్‌గా ఈఆర్సీ పేర్కొన్నది. డిస్కమ్‌లు 15 పైసలు తగ్గించాలని కోరితే జీఎస్టీ ధరల తగ్గింపులో యూనిట్‌కు 12 పైసలు తగ్గుతుందని తేల్చింది. జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాన్ని పీపీఏ నిబంధనల ప్రకారం డిస్కమ్‌లు, డెవలపర్లు చెరిసగం పంచుకోవాలని స్పష్టం చేసింది. అంటే యూనిట్‌కు గరిష్ఠంగా 6 పైసలు తగ్గించింది.