ముంబై, సెప్టెంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జరుగుతున్న శాంతి చర్చల్లో అనిశ్చితి ఏర్పడటం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను నిరాశపరిచింది. అయితే ప్రారంభం నుంచి అమ్మకాలకు మొగ్గుచూపిన దలాల్ స్ట్రీట్ వర్గాలకు మధ్యాహ్నం తర్వాత గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు ఊరటని చ్చాయి.
ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్.. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 242.65 పాయింట్లు కోల్పోయి 72,529.07 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 64 పాయింట్లు పతనం చెంది 22,716.20 వద్దకు జారుకున్నది.
టాటా గ్రూపునకు సంబంధించిన షేర్లు పతనం చెందాయి. టాటా సన్స్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో గ్రూపు కంపెనీల షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి. వీటిలో టాటా కెమికల్స్ షేరు గరిష్ఠంగా 4.20 శాతం పడిపోగా, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 3.10 శాతం, టైటాన్ 2.72 శాతం, టాటా టెలిసర్వీసెస్ 2.63 శాతం, టీసీఎస్ 1.72 శాతం, టాటా పవర్ 1.10 శాతం, టాటా ఎల్క్సిస్ 1.53 శాతం మేర క్షీణించాయి.