ఫార్మాసిటీ బాధిత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 : కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలను సేకరించిందని.. అలాగే, రైతుల నుంచి మరో 2,500 ఎకరాల పట్టా భూములను తీసుకోవాలని అనుకున్నా.. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో యాచారం మండలంలోని తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాల్లో రైతు లు పెద్ద ఎత్తున భూములు కోల్పోయారని, పట్టా భూము లు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్‌ను తాను, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరిన వెంటనే 2,500ఎకరాల పట్టా భూములు తిరిగి రైతులకు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారని గుర్తు చేశారు. కానీ, అంతకుముందే యాచారం, కందుకూరు మండలాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు తాము అధికా రంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి.. మీ భూములను మీకే తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చి..
ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి 34 నెలలు దాటినా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2500 ఎకరాల పట్టా భూములను వారికి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిడ్డారు. అలాగే, రైతుల నుంచి సేకరించిన 14 వేల ఎకరాలకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు మీర్ఖాన్పేట వద్ద హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటుచేసి ఇండ్ల స్థలాల లాటరీ బీఆర్ఎస్ హయాంలో తీసినా.. కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు ఆ ప్లాట్లకు సంబంధించి పొజిషన్ చూపించడంలేదని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ హయాంలో సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఫ్యూచర్‌సిటీ పేరుతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో భూదందాకు పాల్పడుతుందని సబితారెడ్డి మండిపడ్డారు. సీఎంతోపాటు ఆయన సోదరులు, ఇతర మంత్రు లు పెద్ద ఎత్తున భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పా టు చేయాలని, లేదంటే ఆ భూములను తిరిగి రైతులకే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.
ఫార్మాసిటీ కోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో సేకరించిన భూములకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు గత 34 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతోపాటు స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సోమవారం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తే వారిని పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించి ఠాణాకు తరలించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2,500 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం తిరిగి రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.