Honeymoon Murder case : మేఘాలయ (Meghalaya) లో హనీమూన్ హత్య (Honeymoon Murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా (Bollywood Movie) తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబసభ్యులు చెప్పారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ డైరెక్షన్లో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో సినిమా తెరకెక్కనుంది.
షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు నింబావత్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 80 శాతం చిత్రాన్ని ఇండోర్‌లో, 20 శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తామని తెలిపారు. అయితే నటీనటుల వివరాలను ఆయన ఇంకా వెల్లడించలేదు.
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే 11న సోనమ్ రఘువంశీని వివాహం చేసుకున్నాడు. కొత్త దంపతులు హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో రోడ్డు పక్కన డాబా వద్ద సోనమ్ రఘువంశీ ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే విచారణలో సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది. ఈ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.