టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో తెలుగు నిర్మాతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు 90రోజులకు ముందే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న అగ్ర హీరోల చిత్రాలకు ఊరట లభించింది.
గతంలో మాదిరిగానే ప్రీమియర్స్‌తో పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు వెసులుబాటు లభించింది. ఇకపై టికెట్ ధరల పెంపు కోసం సాధారణ పద్ధతిలోనే నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే వీలు కలిగింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో పవన్‌కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు మార్గం సుగమమైంది. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది.