హైదరాబాద్, జూలై26 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర జలాలపై సోమవారం జరిగే భేటీపై తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు అనేక అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన రేవంత్ సర్కార్ తీరుపై వారు మండిపడుతున్నారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం వినిపించే వాదనలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుంగభద్ర జలాలపై ఇటీవల కేంద్రం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ సోమవారం తొలిసారిగా భేటీ కానున్నది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ నేతృత్వంలో మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సమావేశం ఈ జరుగనున్నది. కమిటీ భేటీ నేపథ్యంలో తెలంగాణ నీటిరంగ నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తుంగభద్ర జలాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఉన్నాయి.
నిర్దేశిత వాటా మేరకు జలాలను వినియోగించుకోలేకపోతున్నామని ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి. ఆయా అంశాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు గతనెల భేటీ అవడం, సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్రానికి అప్పగించడం, తత్ఫలితంగా కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవలే కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మెంబర్ చైర్మన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీకి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ నేతృత్వం వహిస్తుండగా, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, సీడబ్ల్యూసీలోని 4 విభాగాల సీఈలు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, మెంబర్ సెక్రటరీతో మొత్తంగా 9 మంది సభ్యులుగా ఉన్నారు.
తుంగభద్ర జలాలపై ఏర్పాటైన హైలెవల్ కమిటీ అధ్యయనం చేయాల్సిన అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. ఆర్డీఎస్ దిగువన నీటి వినియోగం, డిమాండ్లు, నిర్వహణ సమస్యలు, ప్రస్తుత పరిస్థితి, తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికస్థాయి, తద్వారా తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, జలవిద్యుదుత్పత్తిపై పడే ప్రభావం, పూడిక తొలగింపు సాంకేతిక, ఆర్థిక అంశాలు, నివారణ మార్గాలు, నావలి రిజర్వాయర్ నిర్మాణ ఆవశ్యకత, దిగువ రాష్ర్టాల నీటి వాటాకు కలిగే నష్టం తదితర అంశాలను అధ్యయనం చేయాలని నిర్దేశించింది. ఆరు నెలల్లో నివేదికను సమర్పించాలని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆ కమిటీ నేడు ఢిల్లీలో భేటీకానున్నది.
వాస్తవంగా అంతర్రాష్ట్ర జలవివాదాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించడానికి, అంతర్రాష్ట్ర విభాగం ప్రత్యేకంగా ఉన్నది. కానీ ఆ విభాగం అధికారులకు కమిటీలో చోటుకల్పించకుండా కేవలం ఈఎన్సీలతోనే భేటీ ఏర్పాటుచేయడం అనేక ఆనుమానాలను రేకేత్తిస్తున్నది. తెలంగాణ ఈఎన్సీ (జనరల్)పైనా నీటిరంగ నిపుణులు అవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ క్యాడర్‌కు చెందిన వ్యక్తికావడమే అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కమిటీలో తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం వాటిల్లుతుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు తుంగభద్ర నుంచి మొత్తంగా 15.80 టీఎంసీల నీటి కేటాయింపులు ఆర్డీఎస్కు ఉన్నాయి. అందులో గరిష్ఠంగా 5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి. దీంతో గత కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీమ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పూర్తికాకపోవడం, గతంలో ధ్వంసంచేసిన తూమును ఇప్పటికీ మూసివేయకపోవడం, మరోవైపు ఎగువన కర్ణాటక, ఏపీ ఇష్టారీతిన నీళ్లను మళ్లించిన ఫలితంగానే ఆర్డీఎస్కు నీరందని పరిస్థితి ఎదురవుతున్నది. ఆయా అంశాలపై ఇప్పటికే ట్రిబ్యునల్‌లో వాదనలకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఏపీతో ఆయా అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుపడం సరికాదని.. దీంతో ట్రిబ్యునల్‌లో వాదనలకు విఘాతం ఏర్పడుతుందని, తెలంగాణ డి మాండ్లకు విలువ లేకుండా పోతుందని రా్రష్ట్ర నీటి రంగనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.