King | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంతో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ తొలిసారి వెండితెరపై అడుగుపెడుతుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే స్టార్ కాస్టింగ్‌తో హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటులు రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ ‘కింగ్’లో కలిసి కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మీడియా కథనాల ప్రకారం.. ‘కింగ్’ సినిమాలో రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్లను ఒక జోడీగా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. రాణి, అభిషేక్ గతంలో పలుమార్లు కలిసి నటించారు. ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘కభీ అల్విదా నా కెహ్నా’, ‘లాగా చునరీ మే దాగ్’ వంటి సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘బంటీ ఔర్ బబ్లీ’లో వీరి కెమిస్ట్రీకి మంచి స్పందన లభించింది. దీంతో చాలా కాలం తర్వాత మరోసారి ఈ జోడీ తెరపై కనిపించబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక ‘కింగ్’ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. షారుఖ్, దీపికా కాంబినేషన్‌కు బాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ గతంలో ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పఠాన్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. దీంతో ‘కింగ్’లో దీపికా పాత్ర ఎలా ఉండబోతోందన్న దానిపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌కు కూడా ఈ సినిమా అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పటికే ఓటీటీ ప్రాజెక్ట్‌లతో నటిగా పరిచయమైన సుహానా.. ‘కింగ్’తో తొలిసారి థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ను భారీ యాక్షన్ అంశాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘కింగ్’ సినిమాపై ఉన్న క్రేజ్‌కు మరో ఉదాహరణగా భారీ బిజినెస్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లకు అమ్ముడైనట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.