Raayavalasa | హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్న నూతన నటుడు కార్తిక్ జయంతి కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం “రాయవలస”. పూర్తిస్థాయి యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్ కలగలిపిన మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. RaysuN ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత గోపీ కృష్ణ జె ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించడమే కాకుండా, చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది. డెబ్యూ నటుడైనప్పటికీ కార్తిక్ జయంతి తన ఇంటెన్స్ లుక్, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాబోయే నవంబర్ 20వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇక తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో హీరో కార్తిక్ జయంతి చేతిలో త్రిశూలం పట్టుకుని, అమ్మవారి విగ్రహం ముందు అత్యంత పవర్ఫుల్ భావోద్వేగంతో నిలబడి ఉన్న తీరు సినిమాలోని యాక్షన్ డెప్త్‌ను, రౌద్రాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ చిత్రంలో కార్తిక్ సరసన శ్రీష నులు కథానాయికగా నటిస్తుండగా, రాఖీ ఎ ఈ కథకు ఆకర్షణీయమైన మాటలు, కథనాన్ని అందించారు. సీనియర్ నటీనటులైన అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్‌లతో పాటు ప్రముఖ నటులు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు వంటి దిగ్గజ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు ప్రధాన బలంగా మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాలా స్వరపరిచిన సంగీతం నిలవనుంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు రాసిన సాహిత్యాన్ని ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, మరియు కార్తిక్ జయంతి ఆలపించడం విశేషం. ఈ చిత్రానికి విఆర్కే నాయుడు (కిట్టు) ఛాయాగ్రహణం అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ కూర్పు బాధ్యతలు నిర్వహించారు. మల్లేశ్ షాలియోన్ యాక్షన్ కొరియోగ్రఫీ, రాజ్ పైడే నృత్య రీతులు సమకూర్చగా, తేజస్వి సజ్జా పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. పక్కా యాక్షన్, మెలోడీ, భావోద్వేగాలు కలగలిపిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.