Bigg Boss 10 | బిగ్ బాస్ ఇంట్లో ‘మహా పరీక్ష’ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు 16 మంది కంటెస్టెంట్లలో పలువురు మ్యాజికల్ కీస్ సాధించగా.. మిగిలిన కంటెస్టెంట్లకు కూడా కీలకమైన పవర్స్ అందేలా బిగ్ బాస్ టాస్కులు, నిర్ణయాలతో ఇంటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో మ్యాజికల్ కీస్ ఎంపిక నుంచి టీమ్ లీడర్ల ఎంపిక వరకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహా పరీక్షలో భాగంగా ఇప్పటికే మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి ఇంకా ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ సూచిస్తాడు. ఈ సందర్భంగా త్రిగుణ్ ముందుగా వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదిస్తాడు. మరోవైపు షాలినీ తన అభిప్రాయాన్ని చెబుతూ రోహిత్ పేరు ప్రస్తావిస్తుంది.
దీంతో హౌస్‌లో కొంతసేపు పెద్ద చర్చ జరుగుతుంది. చివరకు ఎక్కువ మంది వంశీ, కృష్ణుడు పేర్లకే మద్దతు ఇవ్వడంతో వారిద్దరికీ కూడా మ్యాజికల్ కీస్ లభిస్తాయి. అయితే ఈ నిర్ణయం అందరికీ నచ్చినట్లు కనిపించలేదు. ముఖ్యంగా రోహిత్ వాటర్ టాస్క్ సరిగ్గా చేయలేదనే విషయాన్ని త్రిగుణ్ పదేపదే ప్రస్తావిస్తాడు. దీంతో రోహిత్ విషయంలో హౌస్‌లో చర్చ మొదలవుతుంది. మ్యాజికల్ కీ విషయంలో తీసుకున్న నిర్ణయంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తనకు ఆ నిర్ణయం ఫెయిర్‌గా అనిపించలేదని రాం ప్రసాద్‌తో చెబుతూనే.. చివరకు సెలబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికి కీస్ రావడం పట్ల సరదాగా స్పందిస్తుంది. మరోవైపు సుధీర్ మాత్రం ఈ నిర్ణయం వెనుక అసలు నిర్ణయం మరొకరిదే అన్నట్లుగా వర్షిణి, ఝాన్సీ తదితరులతో చర్చ మొదలుపెడతాడు. అయితే వర్షిణి మాత్రం సుధీర్‌కు గట్టిగానే సమాధానం ఇస్తుంది.
ఆయన నిర్ణయమే అయితే ఇంతసేపు డిస్కషన్ ఎందుకు పెడతాం? మా నిర్ణయం కూడా ఉంది” అంటూ సుధీర్ వాదనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో సుధీర్ కూడా తన మాట మార్చినట్లుగా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే ఇంట్లో రోజువారీ పనుల విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి. కిచెన్‌లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ.. కర్రీ గురించి అడుగుతుంది. దానికి త్రిగుణ్ “అది నా కేటగిరీ కాదు” అంటూ సమాధానం ఇవ్వడంతో షాలినీకి కోపం వస్తుంది.అదే విషయాన్ని మరోలా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుంది. అలాగే కిచెన్, క్లీనింగ్, బాత్రూం క్లీనింగ్ వంటి పనులను డివైడ్ చేసే సమయంలోనూ త్రిగుణ్‌తో మరోసారి వాగ్వాదం జరుగుతుంది. సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. “మేం చేయలేమా?” అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు స్పందించడంతో పరిస్థితి వేడెక్కుతుంది.
ఇక నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా చర్చించుకుంటూ నవ్వులు పూయిస్తారు. ఎవరిని నామినేట్ చేయాలి.. ఎవరిని వదిలేయాలి అంటూ సరదాగా మాట్లాడుతూ.. “వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఇన్ని కష్టాలున్నాయి” అంటూ కామెడీ చేస్తారు. చివరకు ఇంట్లో మనిద్దరమే మిగిలామని.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందామంటూ నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకోవడం ఆకట్టుకుంది. మ్యాజికల్ కీస్ సాధించిన ఒక్కొక్కరినీ బిగ్ బాస్ పిలిచి.. వారికి దక్కిన ప్రత్యేక పవర్ ఏమిటో వివరిస్తాడు. అయితే ఆ పవర్ గురించి ఇంట్లోని ఇతర కంటెస్టెంట్లతో ఎలాంటి చర్చ చేయొద్దని స్పష్టంగా హెచ్చరిస్తాడు. త్రిగుణ్‌కు ‘టేక్ ఓవర్’ పవర్ లభిస్తుంది. అంటే ఎదురుగా ఉన్న ఏ కంటెస్టెంట్ పవర్నైనా తీసుకునే అవకాశం అతనికి ఉంటుంది.
ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్ దక్కుతుంది.ముఖేష్ గౌడకు ఇతరుల పవర్‌ను రివర్స్ చేసి ఇవ్వగల పవర్ లభిస్తుంది.వర్షిణికి ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్ వచ్చింది.కృష్ణుడికి ‘స్వాప్’ పవర్ లభించింది. అంటే ఎలిమినేషన్‌కు బదులుగా ఏ ప్లేయర్ ప్లేస్నైనా స్వాప్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా షాలినీకి డ్యూటీ అసైన్ చేసే పవర్, శ్రిష్టికి డైరెక్ట్ నామినేషన్ పవర్, రాం ప్రసాద్‌కు సేఫ్ షీల్డ్, నరేష్‌కు నామినేషన్స్‌లో డబుల్ ఓట్ పవర్ లభించాయి.ఇక తాళం తీసే సమయంలో నరేష్ పడిన ఇబ్బందులు కూడా ఫన్‌గా మారాయి. లోపల ఉన్నది చదవడానికి ప్రయత్నించినా.. చదివిన తర్వాత కూడా అర్థం కాకపోవడంతో నరేష్ ఇబ్బందులు పడుతాడు.