Thatha Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం నాడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్సే క్వార్టర్స్‌లోని ఎమ్మెల్సీ తాతా మధు నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ తాతా మధును అక్రమంగా అరెస్టు చేసి తరలించారు.
కాగా, శాసనసభ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోమవారమే వివరణ ఇచ్చారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో సహచర ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఘటన జరిగిన తీరును తాతా మధు వివరించారు.
మహిళా శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కూడా దాడి జరిగిందని తెలిపారు. ‘నాపై దాడి చేసి ప్యాంటు లాగేందుకు ప్రయత్నించారు. గొంతు నొక్కుతూ చెప్పడానికి వీలులేని రీతిలో దుర్భాషలాడుతూ, తొడల్లో పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యా. ఈ సందర్భంగానే అక్కడ దాడికి యత్నంచిన అధికారులను నిలదీసిన. నాపై దాడి చేసింది ఎవరు?.. ప్యాంటు లాగేందుకు ప్రయత్నించింది ఎవరు?.. అలా చేయమని ఎవరు ఆదేశించారని అక్కడున్న పోలీసులను ఉద్దేశించే ఆగ్రహం వ్యక్తం చేశా. కానీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. స్పీకర్ వ్యవస్థపై, వ్యక్తిగతంగా స్పీకర్‌పైనా తనకు ఎంతో గౌరవముంది.
స్పీకర్‌ను ఉద్దేశించి ఒక మాట అనలేదు. అయినప్పటికీ నేను అనని మాటలను నాకు ఆపాదించడం సరికాదు. ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్టు భావిస్తే, ఆ మాటలను ఉపసంహరించుకుంటున్న. అందుకు విచారం వ్యక్తం చేస్తున్న’ అని తాత మధు వివరించారు. శాంతియుతంగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తాతా మధు వెల్లడించారు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతు నొకడం వంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.