కొల్లాపూర్, జూలై 26 : పట్టణాలకు వలసలు వెళ్లి న పాలమూరు వాసులు బీఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన పాలమూరుకు వాపస్ వచ్చారు. ము ఖ్యంగా ఎంజీకేఎల్ఐ ఆయకట్టులోని 3లక్షల 65వేల ఎకరాలలో అత్యధిక శాతం వరి పంట సాగు అవుతుండేది. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నా కృష్ణానదిలోని నీళ్లను ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నుంచి డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నదని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేయకుండా ప్రభుత్వం రైతులు వేసుకునే పంటల సాగు అదునును తప్పించేందుకు ప్రయత్నం చేస్తుందని రై తులు విమర్శిస్తున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా లో వరి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొన్నది.
కృష్ణానదికి వరద ఉధృతి చాలా తక్కువగా ఉండడంతో శ్రీశైలంలో నిల్వ ఉన్న 830 అడుగుల నీళ్లతో ఏపీలోని ఎత్తిపోతల పథకాలు కానీ, పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్లు కానీ పని చేసేందుకు అవకాశంలేదు. ఎంజీకేఎల్ఐ, పీఆర్ఎల్ఐ ఎత్తిపోతల పథకాలకు శ్రీశైలం డెడ్ స్టోరేజీ అయిన కోతిగుండు ప్రాంతం నుంచి కృష్ణానది నీళ్లను ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నది. జూలై 14న గంట పాటు పీఆర్ఎల్ఐ మొద టి లిఫ్ట్‌లోని మొదటి పంప్‌ను ఆన్ చేసి 0.01 టీఎం సీ నీళ్లను ఎత్తిపోసిన సంగతి తెలిసిందే. తర్వాత మిగిలిన పంప్‌లను వెట్న్త్రో కూడిన ట్రయల్ రన్ కూ డా చేశారు.
ఎత్తిపోసిన నీళ్లు అంజనగిరి రిజర్వాయర్‌లో మాత్రమే ఉంటాయి. అంతకంటే ముందుకు వెళ్లాలి అంటే మూడో ప్యాకేజీలోని బీఆర్ఎస్ ప్రభు త్వం తర్వాత మిగిలిపోయినా కేవలం 10లక్షల క్యూ బిక్ మీటర్ల పనులను పూర్తి చేయాలి. అలా చేయకుం డా తాగునీటి కోసం ఎంజీకేఎల్ఐ మొదటి రిజర్వాయర్‌లోకి నీళ్లను పంపిస్తున్నామంటే, ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేసే ఉ ద్దేశం ప్రభుత్వానికి లేద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కృష్ణానదిలో ఎంజీకేఎల్ఐ నుంచి నీళ్లను డ్రా చేసుకునేందుకు అవకాశం ఉ న్నా చేయకుండా జాప్యం చేస్తే, వరద వచ్చి 854 అ డుగులకు చేరుకోగానే ఏపీలోని ప్రాజెక్టులు అన్ని కొద్దిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తాయని తెలంగాణ సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఎంజీకేఎల్ఐ ఆయకట్టు పూర్తిగా తగ్గిపోయే ప్రమా దం ఉన్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా రైతులు పెద్ద పుష్యాల కార్తెలోపు వరి నాట్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు అదును దాటిపోతున్న నాట్లు పడటం లేదు. గతేడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 1,80,745 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తే, ఈ ఏడా ది వానకాలంలో ఐదు వేల ఎకరాలకు మాత్రమే నా రుమడులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంజీకేఎల్ఐ నుంచి సాగు నీరు విడుదల చేయకుండా రైతులు వరి పంట సాగు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అదును తప్పిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి పంట పండించేందుకు అవకాశం ఉన్న చోట పంట సాగు అదునును తప్పిస్తే ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఎంజీకేఎల్ఐ కిద గత వానకాలం అంతా కాకపోయినా కొంత మేర వరి పంటను సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం వరి పంట వేయవద్దని రైతులకు అధికారుల చేత అవగాహన కల్పిస్తున్నారు.
ఎంజీకేఎల్ఐ నుంచి సాగు నీరు విడుదల చేస్తే వరి పంట వేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ నుంచి కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రైతుల అదును తప్పించేందుకు నీళ్లను లిఫ్ట్ చేయకపోతే నీళ్లు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాజెక్టులు రోజుకు రెండు నుంచి నాలుగు టీఎంసీలను డ్రా చేస్తాయని, ఎంజీఎల్‌ఐ మాత్రం కేవలం 30 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన మోటర్లతో 800 క్యూసెక్కుల నీళ్ల కంటే ఎక్కువ డ్రా చేయలేవని సాగునీటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఎంజీకేఎల్ నుంచి కృష్ణానది నీళ్లను లిప్ట్ చేసి రిజర్వాయర్లన్నింటిని నింపి పెట్టాలని రైతు సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 821అడుగులుగా ఉన్నది. అందుకే ప్రస్తుతం తాగునీటి వరకు మాత్రమే లిఫ్ట్ చేస్తాం. 854 అడుగుల వరకు నీళ్లు వస్తే ఇరిగేషన్‌కు వాడుకునేందుకు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాగునీటికి అవకాశం లేదు. కేవలం తాగునీటికి మాత్రమే అవకాశం ఉన్నది.
– లోకిలాల్ నాయక్, ఇరిగేషన్ శాఖ ఈఈ