AP News : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మంగళవారానికి వాయుగుండంగా బలపడనుందని, దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడతాయని స్పష్టంచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. బుధవారం (సెప్టెంబర్ 23) నాటికి వర్షాల ప్రభావం మరింత పెరగనుంది.
అల్లూరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీచేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
అందువల్ల మత్స్యకారులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వేటకు వెళ్లరాదని స్పష్టంగా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రజలు ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.