మహబూబ్‌నగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక వైపు నిండు గా నీళ్లు.. తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు.. కర్ణాటకలోని కృష్ణ, భీమా నదీ పరీవాహక ప్రాంతాల వైపు పచ్చగా పంటపొలాలు దర్శనమిస్తుంటే.. తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కృష్ణా, భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బరాజ్‌లను పరిశీలించింది. బీఆర్ఎస్ ‘చలో కర్ణాటక’ పేరుతో జిల్లాకు చెందిన రైతులతో కలిసి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు రైతులతో కలిసి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించారు.
ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీ శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయం నుంచి కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. ముందుగా కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గూడూరులో భీమా నదిపై నిర్మించిన బ్రిడ్జి కమ్ బరాజ్‌ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఆ తర్వాత గూగల్‌లో కృష్ణానదిపై కర్ణాటక మరో ప్రధాన బరాజ్‌ను నిర్మించడమే కాకుండా పక్కనే జలవిద్యుత్తు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని పరిశీలించింది.

(25.7.26 సాయంత్రం 6 నుంచి 26.7.26 సాయంత్రం 6 వరకు)
గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్లు10.32 టీఎంసీలు
ఈ సీజన్లో వృథాగా పోయిన నీళ్లు 116.75 టీఎంసీలు
మేడిగడ్డ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 1,08,500 క్యూసెక్కులు
కర్ణాటక జలదోపిడీని కండ్లకు కట్టినట్టుగా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మీడియాకు వివరించింది. భీమా నదిపై అక్రమంగా నిర్మించిన గూడూరు బ్రిడ్జి కమ్ బరాజ్‌ను పరిశీలించిన బృందం ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదేమీ అన్యాయమంటూ నిలదీశారు. కర్ణాటక వైపు నిండుగా నీళ్లు కనిపిస్తుంటే.. తెలంగాణ వైపు చుక్కనీరు లేక ఎండిపోయిన నదిని చూపుతూ.. పరిస్థితి ఇలాగే ఉంటే పాలమూరు ఎడారి కావడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. చుక్క నీళ్లు కిందికి పోకుండా ఏకంగా హైడ్రాలిక్ గేట్లు బిగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆ తర్వాత బరాజ్‌పై నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎండగట్టారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు ఆపాలి.. ముగ్గురు సీఎంల ఒప్పందాలు బయటపెట్టాలి.. తెలంగాణ ఎండింది.. కర్ణాటక నిండింది.. అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
కృష్ణానదిలో ఎగువ నుంచి వస్తున్న నీటిని ఒడిసి పట్టి యాద్గిర్ జిల్లా గూగల్ వద్ద నిర్మించిన భారీ కమ్ బరాజ్‌తో కర్ణాటక భారీ జల దోపిడీ యత్నాన్ని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మీడియాకు కండ్లకు కట్టినట్టి చూపింది. ఆల్మట్టి నుంచి భారీ ఎత్తున వరద నీరు కిందకు వస్తుంటే ఇక్కడ మాత్రం దాదాపు మూడు టీఎంసీలకు పైగా నీటిని నిలిపివేశారని ధ్వజమెత్తారు. భారీగా హైడ్రాలిక్ గేట్లను బిగించి పక్కనే భారీ జలవిద్యుత్తు కేంద్రాన్ని కూడా నిర్మించారని తెలిపారు. కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని ఆరోపించారు. నారాయణపూర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే చోట సుమారు ఐదు చోట్ల బరాజ్‌లు నిర్మించినట్టు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
అంతేకాకుండా దాదాపు 10 నుంచి 15 లిఫ్టులను కూడా ఏర్పాటుచేసి నీటిని అక్రమంగా వాడుకొంటున్నారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణ వైపు కృష్ణానది నుంచి నీరు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భారీ వరదలు వస్తే తప్ప కిందికి నది ప్రవహించే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ నీటిని నిలువరించారని తెలిపారు. తాజాగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో మరో రెండు బరాజ్‌లను ప్రతిపాదిస్తే సీఎం రేవంత్ సిగ్గులేకుండా వాటిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరు మాగాణికి మరణశాసనం రాసే కృష్ణా, భీమా నదులపై నిర్మించిన అక్రమ ప్రాజెక్టులన్నింటినీ మూసివేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో కూడా నీళ్లు రాకపోతే ఇక ఎండాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయం ప్రాజెక్టు ఎత్తును ఇప్పుడు ఉన్న దానికంటే మరో 300 మీటర్ల అదనంగా ఎత్తు పెంచేందుకు, సుమారు 300 టీఎంసీల నీటిని నిలువ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం పావులు కదుపుతున్నదని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయని, గుట్టుచప్పుడు కాకుండా భూసేకరణ కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే నదుల ద్వారా పాలమూరు జిల్లాకు నీళ్లొచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎండిపోయి కేవలం కట్టడాలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

ఏపీ, కర్ణాటక చేడుతున్న అక్రమ ప్రాజెక్టులపై తాము రాజకీయం చేయడం లేదని, పాలమూరు ఉమ్మడి జిల్లా బతుకుకోసం పోరాడుతున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పాలమూరు కరువును చూసి ఆనాడే అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని అది కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా ఎప్పుడో సస్యశ్యామలమయ్యేదని పేర్కొన్నారు. అక్కడి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి రాష్ట్రంలో కొత్తప్రాజెక్టులు తొందర్లో నిర్మించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని, దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా, భీమా నదులపై అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినామని గుర్తుచేశారు. మరో 10,12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని, అందుకోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 90 శాతం పూర్తి అయిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. భీమా నదిలో రీ జనరేటర్ వాటర్ ఎప్పుడు వస్తుండేదని కానీ కర్ణాటక నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల నీరు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కర్ణాటక, ఏపీ చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కర్ణాటక, ఏపీ జలదోపిడీకి వ్యతిరేకంగా పాలమూరు ఉమ్మడి జిల్లాలోని నాయకులు, రైతులు పార్టీలకు అతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జలదోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం కొనసాగిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాను బాగు చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జిల్లాలకు సాగు, తాగునీరు రాని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటకలో కృష్ణా, భీమా నదులకు అడ్డుకట్టలు వేసి నీటి అక్రమంగా మళ్లించుకొంటున్నారని, దీనివల్ల దిగువకు నీరు రాని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. భీమా నదిపై హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కేంద్ర జల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, మాట్లాడి నీళ్ల సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, ఏపీతో చర్చలు జరిపి జిల్లాకు అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపైనే ఉన్నదని చెప్పారు. ఎక్కడికక్కడ నీళ్లు ఆపుతుంటే పాలమూరు జిల్లా ఎడారి అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తామైతే ఇప్పటికే రిజర్వాయర్లలో నీళ్లు నింపే వాళ్లమని, కరువు పరిస్థితుల్లో తెలంగాణను కాపాడే రిజర్వాయర్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు అవగాహన లేక పాలమూరుకు నష్టం జరుగుతుందని ఆరోపించారు.
కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బరాజ్‌ల పరిశీలనతోపాటు వాటిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఇచ్చిన ‘చలో కర్ణాటక’ పిలుపు ఉమ్మడి పాలమూరు జిల్లాను కదిలించింది. భారీ ఎత్తున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. బీఆర్ఎస్ నాయకులకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడే నాయకులు మధ్యలో వచ్చి చేరారు. మక్తల్‌కు చేరేసరికి భారీ కాన్వాయ్‌గా మారింది.
కర్ణాటకలోని అనేక గ్రామాల వెంబడి సాగిన బీఆర్ఎస్ నాయకుల యాత్రను చూసి చర్చించుకోవడం గమనార్హం. కృష్ణా, భీమా నదులపై నిర్మించిన బరాజ్‌లను చూసిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు చలించిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు ఎంత అన్యాయం చేస్తున్నదో కండ్లకు కట్టినట్టుగా వారికి కన్పించింది. భవిష్యత్తులో కృష్ణా, భీమా నదీ జలాల నుంచి న్యాయంగా రావాల్సిన వాటాను సాధించకపోతే పాలమూరు ఎడారిగా మారుతుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాల్యానాయక్, ఇంతియాజ్ ఇసాక్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, మహిపాల్‌రెడ్డి, నరసింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.