నర్మదా: రిజర్వేషన్ల అంశంపై గుజరాత్లో రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా పటేళ్లు, బనియాలు, బ్రాహ్మణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మానవ వ్యర్థాలను శుభ్రం చేసే పనికి సిద్ధమైతే వారికి నెలకు రూ.50 వేల జీతం ఇచ్చేందుకు తాను సిద్ధమని వ్యాఖ్యానించారు.
నర్మదా జిల్లాలోని సాగ్బారా ప్రాంతం ఖోపిలో శుక్రవారం నిర్వహించిన గిరిజన రైతుల సమావేశంలో వాఘేలా మాట్లాడుతూ రిజర్వేషన్ పొందుతున్న వర్గాలు జీవితాంతం వివక్ష, కష్టాలను ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే ముందు గిరిజనుల జీవన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. వాఘేలా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, సామాజిక వర్గాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత యజ్ఞేశ్ దవే మాట్లాడుతూ, వాఘేలా మొదట తన ఇంటి నుంచే ఈ పనిని ప్రారంభించాలని వ్యాఖ్యానించారు. తన ఇంటిలోని చెత్తను శుభ్రం చేసేందుకు వాఘేలా సిద్ధమైతే, ఆయనకు నెలకు రూ.5 లక్షలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. పాటిదార్ నేత అల్పేశ్ కతిరియా మాట్లాడుతూ వాఘేలా వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.