హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన ప్రతిసారీ రైతులకే షాక్ తగులుతున్నది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రధానంగా వ్యవసాయానికే విద్యుత్తు కట్ చేస్తున్నారు. ఈ అప్రకటిత కోతలతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి రోజులో 8-9 గంటలు కూడా కరెంట్ అందడంలేదు. ఇచ్చే కొద్దిపాటి విద్యుత్తును కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదు.
రోజుకు 3-4 సార్లు అంతరాయం తప్పడంలేదు. క్షేత్రస్థాయిలో రైతులకు కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలతో రైతులు ఎక్కడిక్కడ సబ్స్టేషన్లను ముట్టడించి, ధర్నాలు చేస్తున్నారు. లోడ్ పెరిగినప్పుడల్లా గ్రిడ్ నిర్వహణలో భాగంగా అగ్రికల్చర్ ఫీడర్లకే విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఇంజినీర్లు చెప్తున్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నానాటికీ భారీగా పెరుగుతున్నది. దీంతో గృహ, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు విద్యుత్తును సరఫరా చేసి, వ్యవసాయ రంగానికి కోతలు విధించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యవసాయ కనెక్షన్లకు ఫీడర్ల వారీగా కోతలు విధిస్తున్నారు. కొన్ని ఫీడర్లకు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మరికొన్ని ఫీడర్లకు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఇంకొన్ని చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇచ్చే కొద్దిపాటి విద్యుత్తును కూడా నిరంతరాయంగా ఇవ్వడం లేదని, మధ్యలో 3-4 సార్లు కరెంట్ కట్ చేసిన ఉదంతాలున్నాయని రైతులు చెప్తున్నారు. నల్లగొండ జిల్లా అయిటిపాములలో వ్యవసాయానికి రోజుకు 9 గంటలు కూడా కరెంట్ ఇవ్వడంలేదని, మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఇస్తున్నారని, మధ్యలో గంటసేపు కట్ చేస్తున్నారని వాపోతున్నారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ అమాంతం పెరుగుతున్నది. సెప్టెంబర్ 30న గరిష్ఠ డిమాండ్ 19,892 మెగావాట్లుగా నమోదైంది. ఇది 2023 సెప్టెంబర్ 30న నమోదైన గరిష్ఠ డిమాండ్ కంటే ఏకంగా 7,525 మెగావాట్లు (61 శాతం) అధికం. ఇదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. నిరుడు సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారం మధ్యలో రోజుకు 213-270 మిలియన్ యూనిట్లుగా ఉన్న రాష్ట్ర విద్యుత్తు వినియోగం ఇప్పుడు 310 మిలియన్ యూనిట్లు దాటింది.
కరెంట్ కోతలతో పరిశ్రమలకూ తిప్పలు తప్పడం లేదు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట పారిశ్రామికవాడల్లో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, నాచారం, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో అధికారికంగానే కోతలు విధిస్తున్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో 2 గంటలపాటు విద్యుత్తు నిలిపివేశారు. ఫేజ్-2, ఫేజ్-3, ఫేజ్-4 ఫేజ్ -5లో ఎమర్జెన్సీ పేరిట గంటల తరబడి కట్ చేశారు. హబ్సిగూడ సర్కిల్లో హబ్సిగూడ, సైనిక్‌పురి, కీసర డివిజన్లను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా విభజించి 2 గంటలపాటు కోతలు విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట శనివారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. మల్లాపూర్, నాచారం, మౌలాలి ప్రాంతాల్లోని పరిశ్రమలకు బుధవారం సాయంత్రం 5:30 గంటలకే కరెంట్ కట్ చేశారు.