హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానం వెల్లువెత్తుతున్నది. ఆయన మళ్లీ సీఎం కావాలనే ఆకాంక్ష రాష్ట్రంలోని సబ్బండవర్గాల్లో బలపడుతున్నది. ఇటీవల వినాయక చవితి, ఇతర పర్వదినాల్లో పాటల రూపంలో కేసీఆర్పై అభిమానం పెల్లుబుకిన విషయం విదితమే. ముఖ్యంగా యువత ఆటాపాటలతో ఊర్రూతలూగింది. ఇదే కోవలో మంథనికి చెందిన ముగ్గురు యువకులు మంథని బెన్నిపాల్, బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్ తమ అభిమాన నేత మళ్లీ సీఎం కావాలని ఐదు రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించి, కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు, కుటుంబం, విద్యాసంబంధ వివరాలు తెలుసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా దారి పొడవునా ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను కేసీఆర్తో వారు పంచుకున్నారు. తనపై చూపించిన అభిమానానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక కేసీఆర్ను కలిసిన ఆనందంతో వారు ఉప్పొంగిపోయారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని మంథని యువకులు పేర్కొన్నారు. తెలంగాణ సాధకుడు, ప్రగతి రథసారథిని కలువడం ఎంతో ఆనందంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి గాడిలో పడుతుందని, యువతకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవర్చేడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ పాలనలో తాము అనుభవించిన పాలనా ఫలితాలు, ఇంటింటికీ చేరిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి ఏం కోల్పోయామో అర్థం చేసుకున్నారని తెలిపారు. మంథనితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని కేసీఆర్కు వివరించామని చెప్పారు.