మహబూబ్‌నగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మక్తల్ : కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబులు పుట్టించింది. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకపోతే ఆందోళన లేవదీస్తామని చేసిన హెచ్చరికతో దిగి వచ్చిన రేవంత్ సర్కారు తాజాగా తుంగభద్ర, కృష్ణ, భీమా నదులపై చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు చేపట్టిన బ్యారేజీలను నిలువరించకపోతే పరిస్థితులు వేరే లా ఉంటాయని చేసిన హెచ్చరిక రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం గా రావాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా జలదోపిడీకి పాల్పడినందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని విషయాన్ని కాంగ్రెస్ సర్కారు మరచిపోరాదని బీఆర్ఎస్ నాయకుడు హెచ్చరించారు.

ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జిల్లా నేతలు ఇచ్చిన ‘చలో కర్ణాటక‘ పిలుపుతో బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. మాజీ మంత్రి శ్రీ నివాస్ గౌడ్ క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ఎ త్తున రైతులు బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ బృందం కర్ణాటకకు బయలుదేరారు. కృష్ణ, భీమా నదులపై కర్ణాటక కడుతున్న అక్ర మ ప్రాజెక్ట్‌ల పరిశీలనకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డా.సి. లక్ష్మారెడ్డి నాయకత్వం వహించారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి అంజ య్య యా దవ్లతోపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వా ల్యానాయక్, వెంకటేశ్వరరెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి ఉన్నారు.
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీల వల్ల తెలంగాణకు చుక్కనీరు రాని పరిస్థితి దాపురించింది. బచావత్ ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అడ్డగోలుగా బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించి రెండు నదుల నీటిని కిందికి రాకుండా చేస్తోంది. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యా యం జరుగుతోంది. అయితే కర్ణాటక నిర్మించిన బ్రిడ్జి కం బ్యారేజీలను పరిశీలించి బీఆర్ఎస్ నాయకులు అ వాక్కయ్యారు. కర్ణాటకకు నీళ్లు..తెలంగాణకు కన్నీళ్లు అంటూ ఆవేదన చెందారు. కృష్ణ, భీమా పరివాహక ప్రాంతంలో కర్ణాటక వైపు పంటలు పచ్చగా కళకళలాడుతుంటే.. తెలంగాణ వైపు ఎండిన పంటలు, బీడు భూములు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ సర్కారు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో కొట్లాడి నీళ్లు ఇప్పించాల్సింది పోయి వర్షాభావ పరిస్థితులను అడ్డం పెట్టుకొని రైతులకు మరణశాసనం రాస్తుందన్నారు.
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గూగల్ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జి కం బ్యారేజీతోపాటు హైడ్రాలిక్ గేట్లు.. పక్కనే భారీ జల విద్యుత్ కేంద్రం చూసి బీఆర్ఎస్ నాయకులు మీడియాకు అన్ని వివరాలు వివరించారు. కృష్ణ జలాలతో కర్ణాటక రాష్ట్రం కళకళలాడుతుంటే తెలంగాణ వైపు నీళ్లు లేకుండా వెలవెలబోతుందని ఆరోపించారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం లో నుంచి భారీ ఎత్తున ఇన్‌ఫ్ల్లో వస్తున్నా ఇలాంటి కట్టడాల వల్ల తెలంగాణ వైపునకు కొద్దిపాటి వరదలు మా త్రమే వస్తున్నాయని సాక్ష్యాలతో సహా చూపించారు. గూగల్ వద్ద కర్ణాటక వైపు కృష్ణానది జలాలతో నిండుకుండలా కనిపిస్తోంది. తెలంగాణ వైపు మాత్రం తక్కు వ స్థాయి నీటి ప్రవాహం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా ప్రయోజనాలను కాపాడకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మరో రెండు బ్రిడ్జి కం బ్యా రేజీల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని లేకపోతే వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

జిల్లాకు అన్యాయం చేస్తున్న వారిని నిలదీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం.. మన జిల్లా ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలోని గూగల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై శ్రద్ధ లేదన్నారు. రెండున్నరేండ్ల తరువాత మేము పాదయాత్ర చేస్తామంటే సమీక్ష చేశారన్నారు. కృష్ణ, తుంగభద్ర, భీమా నదుల జలాలు కర్ణాటక, ఏపీ దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రజలు అందరం కలిసికట్టుగా పోరాడి మన హక్కులను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి పాలమూరు దశ దిశను మార్చామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ప్రజలు సాగు, తాగు నీటి కోసం గోస పడ్డారన్నారు. మన ప్రాజెక్టులను అడ్డుకున్న ఆదిత్యానాథ్‌ను ఇరిగేష న్ సలహాదారుగా చంద్రబాబు చెప్తే రేవంత్‌రెడ్డి పెట్టుకున్నారని, ఇదెక్కడి దౌర్భాగ్యం అని దెప్పిపొడిచారు. పాలమూరు జిల్లాను ఎడారిగా మారడాన్ని అడ్డుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ముందు ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు.
మహబూబ్‌నగర్‌ను ఎడారి చేసేందుకు పక్క రాష్ర్టా లు ప్రయత్నం చేస్తున్నాయని, తుంగభద్ర నీరు రా కుండా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు నిర్మాణం చేస్తున్నాయని, అలాగే శ్రీశైలంకు కూడా నీరు రాకుండా చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కర్ణాటక వైపు ఉన్న ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్ట్‌ల్లో చుక్కనీరు లేదన్నారు. కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 10శాతం పా లమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు చేస్తే రిజర్వాయర్లు నింపుకొనేందుకు అవకాశం ఉండేదని, దీంతో10 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు. తుంగభద్రపై గుండ్రేవుల నుంచి నీరు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుందని కర్ణాటక కూడా అక్రమ ప్రాజెక్ట్.. బ్యారేజీలు.. చెక్ డ్యామ్‌లు కడుతున్నారని, పై నుంచి నీరు రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
ఇటు కృష్ణ.. అటు భీమా నదుల పై అక్రమ ప్రాజెక్ట్‌లు.. బ్యారేజీలు.. చెక్ డ్యామ్‌లు కడుతున్నారన్నారు. ఆల్మట్టి డ్యామ్ 300టీఎంసీ పెంచేందుకు పనులు జరుగుతున్నాయని,. ఇప్పటికే భూసేకరణ ప్రారంభించారన్నారు. భీమా నదికే నేరుగా హైడ్రాలిక్ గేట్స్ పెట్టారు. వర్షాకాలం కూడా నీళ్లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎగువ కృష్ణ ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసారు..గ్రావిటీతో నీళ్లు వచ్చేవి.. 200 టీఎంసీ నీళ్లు వినియోగించుకునేందుకు అవకాశం ఉండేది..కానీ ఇప్పుడు కర్ణాటక వద్ద నీళ్లు నిలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని మేము పోరాటం చేస్తుంటే పైన ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్.. రిజర్వాయర్లు.. బ్యారేజీ నిర్మాణం చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ పైసలతోనే తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు.. కానీ ప్రాజెక్ట్ నుంచి మహబూబ్‌నగర్‌కు నీరు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారన్నారు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిన విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా ప్రమాదంలో ఉంది.. నీళ్లను కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. గూడూరు వద్ద పెట్టిన హైడ్రాలిక్ గేట్లు తీసి వేయాలని, నిర్మాణం అవుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు నిలిపి వేయాలనీ డిమాండ్ చేశారు. కిందికి వచ్చే నీటితో లక్షన్నర ఎకరాలు యాసంగిలో సాగు చేసేవాళ్లు కిందికి నీరు రాకుంటే రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, యాసంగిలో రైతులకు సాగునీరు అందే పరిస్థితి ఇప్పట్లో లేదన్నారు. ఇతర రాష్ర్టాలు మా నీటిని దోచుకోకుండా పోరాటం చేస్తామని,పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
కృష్ణా, భీమా నదుల సంగమం ప్రదేశం వద్ద జూరాలకు పైభాగంలో కర్ణాటక మరో రెండు బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించాలని ప్రతిపాదిస్తుందని దానిని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులకు సీఎంలు, మంత్రులు వచ్చి పరిశీలించడం సిగ్గుచేటు అన్నారు. కర్ణాటక కడుతుంటే అడ్డుకునేది పోయి ఆ ప్రాజెక్టులను పరిశీలిస్తారా? వాటికి నిధులు ఇస్తామని చెప్తారా అంటూ మండిపడ్డారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు.