సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఓటరు సవరణ జాబితాను బీఎల్వోలు తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నమోదు చేసిన వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్వోలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పటికే గడువును పొడిగించారు. పొడిగించిన గడువు కూడా పూర్తి కావస్తున్నది. కానీ కొంత మంది బీఎల్వోలు మాత్రం అదే తీరుగా వ్యవహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఆన్లైన్ ప్రక్రియ 60 శాతానికి మించలేదు.
గ్రామీణ జిల్లాల్లో ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తిచేశారు. చాలా ప్రాంతాల్లో వివరాలు నింపని ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా బీఎల్వోల దగ్గరే ఉన్నాయి. ఈనేపథ్యంలో గడువు సమీపస్తుండటంతో బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోని ఓటర్లను షిఫ్టెడ్ జాబితాలో చేరే పనిలో పడ్డారు. అలా చేయడం వల్ల నగరంలో ఉన్న ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు లెక్కల్లో చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫారాలు తీసుకోని ఓటర్ల వివరాలను ఆయా పార్టీలకు చెందిన బీఎల్ఏలకు తెలియజేస్తున్నారు. వాళ్లకూ తెలియని వాళ్ల పేర్లను షిఫ్టెడ్ జాబితాలో చేరుస్తున్నారు. ప్రతి పోలింగ్ సెంటర్లోనూ బీఎల్ఏల సహకారంతో ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకోని ఓటర్లందరినీ షిఫ్టెడ్ జాబితాలో నమోదు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
గ్రేటర్ పరిధిలో బీఎల్వోలు వ్యవహరిస్తున్న తీరుతో నగరంలోని అసలైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకపోవడంతో తమ ఓటు పోతుందేమోననే ఆందోళనలో నగర ప్రజలు ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఫారాలు తీసుకోనివాళ్లను షిఫ్టెడ్ జాబితాలో చేరుస్తుండటంతో అసలైన ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముంది. ఓటర్లు తమకు సంబంధించిన ఫారాలను తీసుకోకుంటే బీఎల్వోలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరా తీయాల్సి ఉంటుంది. ఓటర్లు నిజంగానే ఆ చిరునామాలో లేకపోయినా, లేదంటే ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన సందర్భంలో మాత్రమే వారిని షిఫ్టెడ్ జాబితాలో చేర్చాలి.
పోలింగ్ కేంద్రాల్లోనే బీఎల్వోలను అడిగి, లేదంటే వాళ్లే సొంత నిర్ణయం తీసుకుని షిఫ్ట్ జాబితాలో చేర్చడం సరికాదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీఎల్వోలు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆరోపిస్తున్నారు. నిజమైన ఓటర్లను గుర్తించి వారితో ఎన్యుమరేషన్ ఫారాలను అందించి వివరాలు నమోదు చేసేలా ప్రోత్సహించాలి. ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు తనిఖీ చేయకుండానే షిఫ్టెడ్ జాబితాలో చేర్చకుండా చర్యలు తీసుకోవాలని నగర ఓటర్లు కోరుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 ప్రక్రియ పురోగతిని సమీక్షించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విసృ్తతంగా పర్యటించారు. ఈ తనిఖీల్లో భాగంగా శివాబాగ్ కాలనీ, దాసరం బస్తీ హట్స్లోని పోలింగ్ కేంద్రాలు నంబర్లు 139, 146, 160, 161, 162 మరియు 164లను డీఈఓ ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ విధానాన్ని డీఈఓ పరిశీలించారు. అనంతరం అకడి బీఎల్ఓలు , ఎన్నికల సిబ్బందితో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి తప్పులకు తావు లేకుండా దోషరహిత ఓటర్ల జాబితా తయారు చేయడమే మన లక్ష్యమని కర్ణన్ చెప్పారు. సేకరించిన ఫారాలను నిర్ణీత గడువులోగా కచ్చితత్వంతో డిజిటలైజ్ చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. ‘క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిషరించుకుని ప్రక్రియ వేగవంతం చేయా’ అని ఆదేశించారు. పర్యటనలో భాగంగా డీఈఓ స్థానిక నివాసితులతోనూ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒకరూ తమ గణన ఫారాలను సరైన వివరాలతో పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని కర్ణన్ పిలుపునిచ్చారు.