హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ క్యాన్ ఫిన్ హోమ్స్ రూ.20 లక్షల విలువైన మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్‌ను తార్నాక ఆర్టీసీ దవాఖానకు అందజేసింది. శుక్రవారం ఈ మిషన్‌ను దవాఖాన సూపరింటెండెంట్ శైలజా మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదరు సంస్థను అభినందించారు.
ఈ మిషన్‌తో వార్డుల్లో ఉన్న పేషెంట్ల వద్దకే నేరుగా వెళ్లి ఎక్స్‌రే తీసే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్, దవాఖాన మెడికల్ అడ్మినిస్ట్రేటర్ పి శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్లు అచ్యుతానందం, అశోక్ గౌతమ్‌లు పాల్గొన్నారు.