‘ఒక కుటుంబంలోని సభ్యులు.. వారి బంధువులకు 12 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు. మరో కుటుంబంలో భార్యాభర్తలు.. అన్నదమ్ములు.. కూతుర్లు, అల్లుళ్లకు కలిపి 10 డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇంకో కుటుంబంలోని సభ్యులందరితో పాటు.. పళ్లై అత్తగారింటికి వెళ్లిన కూతురుతో కలిపి 8 మందికి కేటాయింపు. పెండ్లికాని యువకుడికి ఇల్లు మంజూరు. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలుంటే వాళ్లిద్దరికీ చెరో ఇల్లు. హైదరాబాద్‌లో ఏనాడూ నివసించని ఇతర జిల్లాలవారికి పదుల సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు. ఇక్కడ ఆధార్ కార్డు చిరునామా ఉండి.. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది. కానీ ఆ వ్యక్తులు ఇక్కడ ఉండరు. వాళ్లకూ ఇండ్ల కేటాయింపు.’ ఇదీ… కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మూసీ బాధితులకు ఇండ్లిస్తున్నట్లు చూపుతూ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల దందా.
సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలనే మహత్తరమైన సంకల్పంతో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనర్హుల పాలవుతున్నాయి. డబ్బులు, అధికారుల అండ, రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్నవాళ్లే డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులనే రీతిలో ఇండ్ల కేటాయింపుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యం గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసీ సుందరీకరణ పేరిట నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసి.. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. అయితే వారిలో కొద్దిమంది అర్హులకు నగరం నలుమూలల ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో కొన్ని ఇండ్లు మంజూరు చేశారు.
మూసీ బాధితుల పేరిట దందా..
అయితే ఇక్కడే ఎమ్మెల్యే అనుచరులు, అధికారులతో కలిసి మూసీ బాధితుల పేరిట డబుల్బెడ్రూం ఇండ్ల దందాకు తెరతీశారు. ఈ దందాకు మలక్‌పేట నియోజకవర్గంలోని ముసారంబాగ్ డివిజన్ శాలివాహననగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌ను అడ్డాగా మార్చుకున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా 45 ఇండ్లకు ప్రభుత్వం మార్కింగ్ చేసి కూల్చారు. వారందరికీ డబుల్ బెడురూం ఇండ్లు కేటాయించారు. కానీ అదే మార్కింగ్ చేసిన గోడలను చూపుతూ దాదాపు మరో 150 ఇండ్లను మంజూరు చేశారు. అందులో అసలైన లబ్ధిదారులు 70 మంది కంటే తక్కువే ఉన్నారు. మిగతా వారంతా ఆ బస్తీలో లేనివారు, ఇతర జిల్లాల్లో ఉంటూ ఇక్కడ అడ్రస్‌ను కలిగి ఉన్నవారే. నిజానికి అంబేద్కర్ నగర్లో 200 కుటుంబాలు ఏండ్ల తరబడిగా నివసిస్తున్నాయి. కానీ వారెవరికీ ఇండ్లివ్వకుండా స్థానికేతరులకే కేటాయించడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వారంతా రెండేండ్లుగా ఇండ్ల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కానీ అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
స్థానికేతరులను తీసుకొచ్చి.. చిరునామాలు మార్చి
మూసీ సుందరీకరణ పేరిట పరీవాహకంలోని ఇండ్లను కూల్చినవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రభు త్వం ప్రకటించినప్పటి నుంచి ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులు, బస్తీలోని కొద్దిమంది లీడర్లు దళారులుగా మారి దందాకు తెరతీశారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసేలా ఒప్పందం చేసుకున్నారని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. బస్తీలోని కొంతమంది బంధువులను ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి అధికారులు మార్కింగ్ చేసిన మొండిగోడల వద్ద ఫొటోలు దింపి.. ఆధార్, ఓటర్ కార్డు ఇక్కడి చిరునామాతో మార్చి ఇండ్లు మంజూరు చేయించుకున్నారని సమాచారం.
ఇందుకు ఒక్కో ఇల్లుకు రూ.3 లక్షలు వసూలు చేశారని చెప్తున్నారు. అందులో ఒక్కో ఇంటికి కొంత మొత్తం చొప్పున 70 ఇండ్లకు పైగా రెవెన్యూ అధికారులకు ముట్టజెప్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో వాళ్లు చెప్పినవారికి వెంటనే ఇండ్లు మంజూరవుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అధికారులు.. దళారులతో కుమ్మక్కవడం వల్ల అసలైన అర్హులకు అన్యాయం జరగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇప్పటిదాకా మంజూరు చేసిన ఇండ్ల లబ్ధిదారులు అసలైన వాళ్లా? కాదా? అని విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బోగస్ లబ్ధిదారులను గుర్తించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.