సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తూ గ్రేటర్ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ పోలీస్ పేరు వింటే నే ఇతర రాష్ర్టా నేరగాళ్లు భయంతో వణికిపోయే వారు. నేడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా నేర ఘటనలు జరుగుతున్నాయి. చోరీలు, దోపిడీలు, నకిలీ పోలీసుల అవతారాలతో ప్రజలను మోసం చేయడం, ఏటీఎం సెంటర్ల వద్ద దృష్టి మళ్లించి ఖాతాలు ఖాళీ చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి.
పాత నేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాల కన్ను ఇప్పుడు తిరిగి హైదరాబాద్‌పై పడటం తో ఆయా నేర ముఠాలు విరుచుకుపడుతున్నాయని సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వ్యవస్థపై పోలీసులకు పట్టు సడలడంతో పాటు ఇతర రాష్ర్టాల ముఠాల ఆటకట్టించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తరచూ జరుగుతున్న ఘటనలలో అంతర్రాష్ట్ర ముఠాలే కీలకంగా వ్యవహరిస్తుండడం, స్థానికంగా ఉండే పాత నేరస్తులు సైతం తమ నేర ప్రవృత్తిని మానుకోకుండా నేరాలకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
రెక్కీ నిర్వహిస్తూ..
అంతర్రాష్ట్ర నేర ముఠాలు గతానికి భిన్నంగా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడుతున్నది. నగరంలోకి ప్రవేశించడం, ఆపై పక్కాగా రెక్కీ నిర్వహించిన తరువాతే నేరాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠాలు ఏటీఎం కేంద్రాలకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. హర్యానా, రాజస్థాన్, మహా రాష్ర్టాలకు చెందిన ముఠాలు నేరాల కోసం నగరానికి వస్తున్నాయి.
హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత లాడ్జీలు, తెలిసిన వారి వద్ద బస చేస్తూ అనుకున్న లక్ష్యంలో దొంగతనం, దోపిడీలు చేసి తిరిగి వారి సొంత ప్రాంతానికో, మరో కొత్త ప్రాం తానికో ఈ ముఠాలు వెళ్లిపోయి అక్కడ కూడా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నది. గత ఏడాది ఆగస్టులో చందానగర్‌లో జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీ చేసిన ముఠా, తిరిగి ఏడాది తరువాత అదే ప్రాంతానికి వచ్చి జ్యువెల్లరీ దుకాణాన్ని టార్గెట్‌గా చేసింది. ఒక నేరం జరిగిన తరువాత విరామం ఇవ్వడంతో పోలీసుల నిఘా తగ్గుతుందనే భావనతో ఈ ముఠాలు కొంత గ్యాప్‌తో వచ్చి నగరంపై విరుచుకుపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భయాందోళనలో ప్రజలు
పోలీసుల నిఘా పటిష్టంగా ఉంటే దొంగల్లో భయం ఉంటుంది. హైదరాబాద్‌కు వెళ్తే పోలీసులకు పట్టుబడుతామనే భయం నేరస్తుల్లో ఉంటుంది. గతంలో ఇలాంటి పరిస్థితులలోనే నేరగాళ్లు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేవారు. నేడు పాత నేరస్తులు, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై పోలీసుల నిఘా తగ్గడంతో పోలీసుల పట్టు కూడా తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా జరుగుతున్న నేరాలతో ప్రజల్లో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నిఘా వ్యవస్థ, పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ పట్టు తప్పడంతో అంతర్రాష్ట్ర ముఠాలకు సమయం కలిసొచ్చినట్లు మారిందని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో వరుసగా జరుగుతున్న నేరాల్లో ఎక్కువగా అంతర్రాష్ట్ర ముఠాల పాత్రనే ఉండడంతో దీనిపై ఉన్నతస్థాయిలో సమీక్షలు నిర్వహించాల్సిన అవసరముంటుంది. తరచూ నేరాలకు పాల్పడేవారికి న్యాయస్థానం ద్వారా శిక్షలు వేయించడానికి పోలీసులు అవసరమైన సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టి, వారికి శిక్షలు పడే విధంగా చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలను కట్టడి చేయడంతో ఇతర రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో టెక్నాలజీని వాడుతూ పనిచేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.