కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో జరగవలసిన చర్చను ప్రభుత్వమైతే తప్పించుకున్నది గానీ, ఆ వెయ్యి రోజుల్లో తమ మ్యానిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు గురించి ఆయా వర్గాలకు వివరించవలసిన బాధ్యత మాత్రం మిగిలే ఉన్నది. ఆయా హామీల అమలు ఎంత జరిగిందో ప్రభుత్వమే కాదు, ఆయా తరగతులకు చెందిన మంత్రులు, శాసనససభ, శాసనమండలికి చెందిన కాంగ్రెస్ సభ్యులు కూడా తెలియజేయాలి. రాష్ట్ర ప్రజలకు చెప్పి, మరింత ముఖ్యంగా ఆయా వర్గాల ప్రజలకు వివరించాలి. ఈ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు మాత్రం ఏ సాకులూ లేవు.
అసెంబ్లీ కార్యక్రమాల చుట్టూ జరిగిన పరిణామాలను కొన్ని రోజులపాటు గమనించిన తర్వాత సామాన్య ప్రజల నుంచి వినవస్తున్న మాటలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి, రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవటం ఎప్పుడూ ఉండేదే. అదే మరొకసారి జరిగింది గనుక దాని గురించి కొత్తగా తలలు బద్దలు కొట్టుకోవలసింది ఏమీ లేదు. రెండు, అంతిమంగా మా జీవితాలు మాకు ముఖ్యం. ఆ విషయమై ఏమి జరుగుతున్నది? మా బతుకులు ఏమైనా బాగుపడుతున్నాయా లేదా? అనేవే మేము ఆలోచిస్తాం. ఆ ప్రకారం ఆలోచించినప్పుడు, మాకు కొన్ని హామీలిచ్చి నమ్మించి, మా ఓట్లతో అధికారానికి వచ్చినవారు, ఆ హామీలను ఈ వెయ్యి రోజుల్లో ఎంతవరకు నెరవేర్చారన్నదే మాకు సమస్య అవుతుంది. అని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ అనే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమనే కాదు. ఎక్కడైనా, ఏ పార్టీ ప్రభుత్వం విషయంలోనైనా, ఎప్పుడైనా జరిగేది ఇదే. సరిగా అదే పరిస్థితి ఇప్పుడు వెయ్యి రోజులు గడిచిన వెనుక రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కనిపిస్తున్నది. ప్రజల ప్రశ్నలు మొత్తం ప్రభుత్వానికే కాదు. పైన పేర్కొన్న వివిధ తరగతుల మంత్రులు, చట్ట సభల సభ్యులకు కూడా. ఈ స్థితిని విస్మరించటం వారందరికీ నష్టదాయకం అవుతుంది. అందువల్ల, తమ వెయ్యి రోజుల పాలనను, తమ మ్యానిఫెస్టో హామీలతో పోల్చుతూ వివరమైన శ్వేతపత్రాన్ని, లేదా నివేదికను ప్రజల ముందు, ఆయా బడుగువర్గాల ముందు ఉంచటం వారి బాధ్యత అవుతున్నది. ప్రభుత్వ పాలన సగ కాలం గడిచిన సందర్భంగా, అటువంటి నివేదికలను, ఏ విధంగానైతే వేర్వేరు డిక్లరేషన్లను, మ్యానిఫెస్టోను తమ జాతీయ నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటించారో, అదే విధంగా తిరిగి వారి చేతుల మీదుగా విడుదల చేయాలి. అది నిజాయితీ, ధైర్యం గల పని అవుతుంది. ఈ అంశాలపై అసెంబ్లీలో జరగవలసిన చర్చ ఎందుకైతేనేమి జరగలేదు గనుక, అందుకు ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిలో నివేదికలను విడుదల చేసినట్టయితే, వాటిపై చర్చించి ఒక అభిప్రాయానికి రాగల అవకాశం ప్రజా బాహుళ్యానికి, ముఖ్యంగా పైన పేర్కొన్న వేర్వేరు బడుగువర్గాలకు లభిస్తుంది.
ఈ మాట అనేందుకు మరొక కారణం కూడా ఉన్నది. వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన పూర్తి పేజీ అడ్వర్టయిజ్మెంట్లలోగానీ, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటల్లో గానీ మనకు పూర్తి చిత్రం అనదగ్గది ఏమీ కన్పించలేదు.
100 రోజుల గ్యారెంటీ కార్డు, వేర్వేరు డిక్లరేషన్ల జోలికి వారెవరూ వెళ్లనైనా వెళ్లలేదు. ఆ పని చేయకపోవటం ఒక కొరతకాగా, అసెంబ్లీ చర్చ జరగకపోవడం రెండవ కొరతగా మారింది. అందువల్ల, అందుకు ప్రత్యామ్నాయంగా కనీసం ఇప్పుడైనా సవివరమైన నివేదికలను ప్రకటించాలి. పైన అనుకున్నట్టు, సామాన్య ప్రజలకు గానీ, బడుగు వర్గాలకు గానీ అసలు సమస్యలు, అంతిమ ప్రశ్నలు గానీ తమ నిజ జీవితాలకు సంబంధించినవి మాత్రమే. అటువంటప్పుడు వాటిని దాటవేసి ఇతర విషయాలపై ఏమేమి జరిగినా వారినవి మభ్యపెట్టలేవు. పూర్తిగా తమ అనుయాయులు, ఆశ్రితులు అయిన చిన్నచిన్న సమూహాలను తప్ప.
ఇప్పుడు బడుగువర్గాల మంత్రులను, చట్టసభల సభ్యులను నిర్దిష్టంగా అడుగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రశ్నలను మొట్టమొదటిది అయిన 100 రోజుల గ్యారెంటీల కార్డుతో మొదలుపెడదాము. అయితే ఒక మాట ముందే చెప్పాలి. ఆ గ్యారెంటీలు గానీ, తక్కిన మ్యానిఫెస్టో గానీ తెలంగాణ ప్రజలందరికీ మొత్తంగా ఎట్లా అమలు అయిందో అడగటం లేదిక్కడ. కేవలం పైన పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలనే బడుగువర్గాలకు, మహిళలు కూడా బడుగులేననే సామాజిక-ఆర్థిక సూత్రీకరణలు ఉన్నందున వారికీ ఏ విధంగా అమలు జరిగాయని మాత్రమే. కనుక, ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు, చట్టసభల సభ్యులు ఈ ప్రశ్నలకు సమాధానాలతో నివేదికలు వెలువరించాలి. వారికి సంబంధించి ఆయా హామీలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసింది? చేసే విధంగా తాము ప్రభుత్వాన్ని ఎట్లా కోరుతూ వచ్చారు? ఎట్లా ఒత్తిడి చేస్తూ వచ్చారు? 100 రోజులు ముగిసినాక పరిస్థితిని ఏ విధంగా సమీక్షించారు? అమలు కాకపోటంపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారా లేదా? చేసి ఉంటే ఫలితమేమిటి? చేయనట్టయితే ఎందుకు చేయలేదు? వంద రోజులు కాస్తా ఇప్పుడు 10 రెట్లు పెరిగి 1000 రోజులకు చేరినాక సంగతేమిటి? దీనిపై ప్రతిపక్షాలు సభలో చేయదలచిన చర్చ భంగపడిన దృష్ట్యా ఇక మీదట ఈ మంత్రులు, సభ్యులు ఏమి చేయదలిచారు? ఇవన్నీ వారి నివేదికల ద్వారా రాష్ర్టానికి, బడుగువర్గాలకు తెలియాలి.
ఇప్పుడు గ్యారెంటీ కార్డులోని నిర్దిష్టమైన అంశాలను చూద్దాము. 1) మహిళలకు ప్రతినెలా రూ.2,500 అమలు కానందున నష్టపోయిన, మోసపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మీ సమాధానం? 2) రైతులు, కౌలుదార్లకు సంవత్సరానికి ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000 అమలు కానందున నష్టపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మీ జవాబు? 3) ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలుకానీ అనేక మందిలో గల ఈ బడుగువర్గాల వారికి మీరిచ్చే వివరణ? 4) ఇందిరమ్మ ఇండ్ల హామీతో ఇంటి స్థలం, నగదు హామీ వెయ్యి రోజుల తర్వాత కూడా లభించని బడుగులకు మీరిచ్చే సంజాయిషీ? 5) విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్ల హామీ నెరవేరనందున నష్టపోతున్న లక్షలాది మంది బడుగు పిల్లలకు గానీ, పింఛన్ రూ.4,000 పెంచటం వెయ్యి రోజులైనా లభించక నిరాశకు గురవుతున్న ఇదే వర్గాలకు చెందిన వారికి గానీ, వారి వర్గాల నుంచి వచ్చిన వారిగా మీరు చెప్పదలచుకున్నదేమిటి?
ఇది ఆరు గ్యారెంటీల 100 రోజుల గడువు 1000 రోజులు తీరినాక కనిపిస్తున్నది కాగా, కాంగ్రెస్ పార్టీ 42 పేజీల మ్యానిఫెస్టోలో ఇంకా అనేక అంశాలున్నాయి. వాటిలోనూ అనేకానేకం ప్రత్యక్షంగా బడుగువర్గాలకు సంబంధించినవి కనిపిస్తాయి. వాటన్నింటిని ఇక్కడ చర్చించలేముగానీ, మొదట ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లతోపాటు, ఎస్సీ-ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా-శిశు సంక్షేమం అనే వాటిని చూద్దాము. ఈ ఏడులో కలిపి మొత్తం 106 అంశాలున్నాయి. ఇవి అన్నీ కూడా సూటిగా బడుగువర్గాలకు సంబంధించినవే. ఇవి 100 రోజుల గ్యారెంటీ కార్డు పరిధికి బయటివి. కనుక ఇప్పటికే ఎందుకు అమలు కాలేదని అడగలేము. కానీ ప్రభుత్వ పదవీ కాలంలో వెయ్యి రోజుల రూపంలో సగకాలం గడిచిపోయినందున, ఈ 106లో అమలైనవి ఎన్నని, ఏ మేరకు అని ప్రశ్నించే హక్కు మాత్రం బడుగువర్గాలకు ఉంటుంది. వారికి ఈ వర్గాల మంత్రులు, చట్టసభల సభ్యులు ఏమి చెప్పదలిచారు?
ఇట్లా నిర్దిష్టంగా ఈ వర్గాలకు సంబంధించిన హామీలు కాకపోయినప్పటికీ, సాధారణ రూపంలో గల ఇతర హామీల్లోనూ ఇతర వర్గాలతోపాటు బడుగువర్గాలకు వర్తించేవి కుప్పతెప్పలుగా ఉన్నాయి. ఉదాహరణకు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు సంక్షేమం, విద్యారంగం, ఆటో డ్రైవర్ల సంక్షేమం, యూత్ డిక్లరేషన్, దివ్యాంగులు, కార్మికుల సంక్షేమం, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామకాలు మొదలైనవి. వీటిలో అనేకం అసలు అమలు కాకపోవటం, లేదా అరకొరగా కావటం వల్ల వెయ్యి రోజులుగా నష్టపోతున్న వారిలో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలే. వీరిపట్ల జరుగుతున్న ఈ దగాలో ప్రభుత్వ బాధ్యతతోపాటు ఈ వర్గాలకు చెందిన మంత్రులు, చట్టసభల సభ్యుల బాధ్యత లేదా?
ఈ మంత్రులు, సభ్యులు ఇటువంటి వర్గాల నుంచి వచ్చి, వారికి నాయకత్వాలు వహించి, వారికి మేలు చేస్తామని నమ్మించి, వారి ఓట్లతో గెలిచి, పదవులు సంపాదించుకొని, ఆ తర్వాత చేస్తున్నదేమిటి? కంపెనీల కోసమని, ప్రక్షాళనల కోసమని, ఎస్సీ, ఎస్టీల భూములను బలప్రయోగాలతో గుంజుకుంటూ వారిపై దారుణంగా భౌతికదాడులు, కూల్చివేతలు సాగిస్తుంటే నోరువిప్పనిది ఎందుకు? ఆ వర్గాల ప్రజలను ఓటుబ్యాంకులుగా వాడుకొని, ఇతరులకు కూడా తాకట్టు పెట్టడమేనా వీరు చేస్తున్నది? ఇటువంటి వారిని కాదా కాన్షీరాం చంచాలోగ్ అని పిలిచి, ఒక పుస్తకమే రాసింది? నేటి తెలంగాణ కాంగ్రెస్‌లోని ఈ వర్గాల నాయకులు తమ మాటలలో ఎన్నెన్ని అట్టహాసాలు చేసినా, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న తమ వర్గాల ప్రజల కోసం ఆచరణలో ఏమి చేస్తున్నారన్నదే అంతిమమైన ప్రశ్న అవుతుంది. గతంలోనూ తలెత్తిన ఈ ప్రశ్న ఇప్పుడు వారి నుంచి మరోమారు వినవస్తున్నది.
ఈ మంత్రులు, సభ్యులు ఇటువంటి వర్గాల నుంచి వచ్చి, వారికి నాయకత్వాలు వహించి, వారికి మేలు చేస్తామని నమ్మించి, వారి ఓట్లతో గెలిచి, పదవులు సంపాదించుకొని, ఆ తర్వాత చేస్తున్నదేమిటి? కంపెనీల కోసమని, ప్రక్షాళనల కోసమని, ఎస్సీ, ఎస్టీల భూములను బలప్రయోగాలతో గుంజుకుంటూ వారిపై దారుణంగా భౌతికదాడులు, కూల్చివేతలు సాగిస్తుంటే నోరువిప్పనిది ఎందుకు? ఆ వర్గాల ప్రజలను ఓటుబ్యాంకులుగా వాడుకొని, ఇతరులకు కూడా తాకట్టు పెట్టడమేనా వీరు చేస్తున్నది?
– టంకశాల అశోక్