హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అసెంబ్లీ విప్ కేపీ వివేకానందగౌడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ప్రసంగం, 22ఏ భూముల వ్యవహారం, నూతన క్యూర్ చట్టం రూపకల్పనలోని లోపాలు, పోలీస్ స్టేషన్లలో చోటుచేసుకుంటున్న దాడుల పరంపరపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. శాసనసభలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని, మంత్రి తనకు అనుకూలమైన విషయాలు మాత్రమే ప్రస్తావిస్తూ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 60 ఏండ్లుగా ప్రజలు నివసిస్తున్న భూములను, ప్రభుత్వ లేఅవుట్లను సైతం కబ్జాదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని, ఇదే విషయాన్ని జయప్రకాశ్ నారాయణ సైతం స్పష్టంచేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనూ సాఫీగా జరిగిన రిజిస్ట్రేషన్లను ఇప్పుడు అకారణంగా నిలిపివేయడంపై కలెక్టర్ సహా ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. 22ఏ భూముల వివాదంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ‘నాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి అసెంబ్లీకి అనుమతిస్తే, అన్ని ఆధారాలతో 22ఏ అంశంపై నిజాలు సభ ముందుంచుతాను. నేను చెప్పేవి అబద్ధాలని నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా’ అని సవాల్ విసిరారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం, పోలీస్ స్టేషన్ల పరిధిలోనే కేటీఆర్ పీఆర్వో, పీఏపై దాడులు జరిగే స్థాయికి శాంతిభద్రతలు దిగజారడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి: వివేకానందగౌడ్
బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ మాట్లాడుతూ.. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ లోపలే కేటీఆర్ పీఆర్వో, పీఏపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని, చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపైకే దుండగులను ఉసిగొల్పి దాడి చేయించే స్థాయికి దిగజారారని ఆరోపించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తునదని ధ్వజమెత్తారు.
దోపిడీ కోసమే ఆదరాబాదరగా బిల్లు
క్యూర్ బిల్లుపై వివేకానందగౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏకంగా 465 పేజీల ముసాయిదా కలిగిన సుదీర్ఘమైన, కీలకమైన చట్టాన్ని శాసనసభలో కేవలం అరగంట వ్యవధిలో చర్చించి, ఒకే రోజులో పాస్ చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. 1955 నాటి మున్సిపల్ చట్టాన్ని రద్దు చేసి, కొత్త నిబంధనలు తెచ్చే ముందు అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అభిప్రాయాలు సేకరించాల్సి ఉండగా, ప్రభుత్వం దోపిడీ కోసమే ఆదరాబాదరగా బిల్లును నెగ్గించుకుందని ఆరోపించారు.
హైదరాబాద్ నగరం రాష్ట్రానికి బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిదని, దాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి ఫోర్త్ సిటీ పేరిట నగరాన్ని లూటీ చేసేందుకు ఈ చట్టాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నదని వివేకానంద గౌడ్ ధ్వజమెత్తారు. కొత్త చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పడుతుందని, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాబోయే మూడు కార్పొరేషన్ల చైర్మన్లు, చివరకు ఎమ్మెల్యేల అధికారాలను సైతం కాలరాసి, సర్వ అధికారాలను ముఖ్యమంత్రికే కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ చట్టం న్యాయస్థానాల్లో నిలబడదని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి లీగల్‌గా పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.