ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతులు వరుసగా కొండి అంజయ్య, అల్ల వెంకటయ్య, మట్ట నారాయణరెడ్డి, కులగాని నారాయణ, మట్ట బాలయ్య, బద్దిపడిగ రాంరెడ్డి.. వీరిది రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్రలింగాపూర్ గ్రామం. వంశపారంపర్యంగా వచ్చిన భూములను వీరు దశాబ్దాలుగా సాగుచేసుకొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకంతోపాటు భూ యాజమాన్య హక్కుల పత్రం పొందారు. ఆ తర్వాత ధరణి ద్వారా కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు.
బ్యాంకుల ద్వారా క్రాప్లోన్లతోపాటు దీర్ఘకాలిక లోన్లు తీసుకుంటూ చెల్లిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇది కేవలం ఈ ఆరుగురు రైతుల వ్యథే కాదు, ఈ గ్రామంలోని వందలాది మంది రైతులది! గ్రామంలో వేయి మందికిపైగా రైతులుంటే.. అందులో 897 మంది రైతులకు చెందిన 711 ఎకరాల భూమిని నిషేధిత (అసైన్డ్) జాబితాలో చేర్చారు. అక్కడితో ఆగకుండా.. మరో 642 ఎకరాలను ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. ప్రభుత్వ భూములుగా నమోదుచేసిన వాటిలోనూ పట్టా భూములున్నాయి. అంటే ఒకే గ్రామంలో సుమారు 80% భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. ఇది సముద్రలింగాపూర్ గ్రామం కథ మాత్రమే కాదు, ఇదే మండలంలోని ముస్తాఫానగర్దీ ఇదే పరిస్థితి. ఈ గ్రామంలో 486 మంది రైతులకు చెందిన 349 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. వందలాది గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొన్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక హామీలు గుప్పించింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో పోడు భూముల రైతులు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయవిక్రయాలతోపాటు అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలో ముద్రించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీని సైతం మట్టిలో కలిపింది. ఏ అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని సర్కార్ చెప్పిందో.. అదే అసైన్డ్భూముల పేరు చెబుతూ ప్రస్తుతం అన్ని భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. పట్టణాలకు మాత్రమే కాదు, పల్లె వ్యవసాయ భూములపై సైతం 22ఏ పడగ నాట్యం చేస్తున్నది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు.
నోటీసులు ఇవ్వకుండానే..
1955 ఖాస్రా పహాణీల ఆధారంగా 22ఏ జాబితా తయారు చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే, ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సర్కార్ భూములుగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రస్తుతం నిషేధిత జాబితాలో పెట్టిన లక్షలాది ఎకరాల్లో ఇప్పటికే క్రయవిక్రయాలు జరిగి.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పట్టాదారు పాపుపుస్తకాలు, భూ యజమాన్యపు హక్కు పత్రాలు జారీ అయినా.. వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 22ఏ జాబితాలో చేర్చారు. అలాగే, ఆర్వోఆర్ ద్వారా అనాటి చట్టాలకు అనుగుణంగా భూముల నమోదులు చోటుచేసుకున్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే.. 1955తో పోలిస్తే అనేక మార్పులు భూముల్లో సంతరించుకున్నాయి. వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అన్నింటినీ ఒక గాటిన కట్టి, 22ఏలో పెట్టి ప్రజలు, రైతుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు.
ఉమ్మడి సర్కార్ తప్పుచేసిందా?
ధరణిలో తప్పులు జరిగాయంటూ.. ఆక్రోశం వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ సర్కార్.. ధరణి రాక ముందే, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు జారీచేసిన పట్టాదారు పాసుపుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుతం లక్షల సంఖ్యలో భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక భూమికి సంబంధించి రెండు రకాల పాసుపుస్తకాలు ఉండేవి. పట్టాదారు పాసుపుస్తకాన్ని తహసీల్దార్ సంతకం చేసి జారీచేశారు. భూ యాజమాన్య హక్కు పత్రం పేరుతో జారీ చేసే పాసుపుస్తకంపై ఆర్టీవో సంతకంతోపాటు సంబంధిత పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కూడా సంతకం చేసి ఇచ్చే వారు.
ఆనాడు కూడా ఇద్దరి సంతకం ఉండటానికి కారణం ఏమైనా నిషేధిత జాబితాలో ఉన్నదా? లేక సర్కార్ స్థలమా..? అని పరిశీలించడానికి భూ యాజమాన్య హక్కు పుస్తకంపై ఆర్డీవో, తహసీల్దార్ సంతకాలు పెట్టారు. ఆనాడు జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను పరిగణనలోకి తీసుకొని.. రెండు రకాల పుస్తకాలను ముగ్గరు ఉన్నతాధికారులు (ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్) సంతకాలు చేసి ఇచ్చిన సదరు లక్షలాది భూములను ఇప్పుడు 22ఏలో చేర్చారు.
ఆనాడు.. అధికారులు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం జారీ చేశారు కదా? మరి అలాంటప్పుడు ఆనాటి సర్కార్లో లేని నిషేధిత భూములు, ఇప్పుడు ఈ నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయన్న దానిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తహసీల్ కార్యాలయంలో ఉమ్మడి రాష్ట్రంలో తప్పు జరిగిందని ఒకవేళ భావించినా.. భూ యాజమాన్య హక్కు పుస్తకంపై.. ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేసి ఇచ్చారు కదా? అలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇప్పుడు సర్కార్ ఇబ్బందులకు గురిచేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
పట్టా భూములుగా మార్చాలి
సముద్రలింగాపూర్లో ఎక్కువమంది రైతుల భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. దీంతో భూముల క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. అనువంశికంగా వచ్చిన భూములను, తల్లిదండ్రుల నుంచి విరాసత్ ద్వారా సంక్రమించిన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. 22ఏ నిషేధిత జాబితా ఎత్తివేయాలి. లేదంటే రైతులు అనేక అవస్థలు పడాల్సి వస్తుందన్న విషయాన్ని సర్కార్ గుర్తు పెట్టుకోవాలి.
– కమ్మరి గంగసాయవ్వ, సర్పంచ్ (సముద్రలింగాపూర్)
తాతల నాటి నుంచి వచ్చిన సాగు భూములు
నాకు తాతల నాటి నుంచి వచ్చిన నాలుగు ఎకరాల భూమిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ యాజమాన్య హక్కుపత్రం, పాసు పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణిలో కూడా కొత్త పాసు పుస్తకాల్లో పట్టా అని ముద్రించి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో బ్యాంకు రుణాలు పొందలేక పోతున్నాం. అవసరానికి సమయానికి అమ్ముకోలేక అయోమయంలో పడే పరిస్థితులను ప్రభుత్వం మా ముందు పెట్టింది.
– మోతె రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ (సముద్రలింగాపూర్)
అప్పులు తీర్చుదామంటే అమ్మడానికి లేదంటున్నరు
ఇతని పేరు మోతె భూపతిరెడ్డి. ఇతని తండ్రి మోతె రాంరెడ్డి నుంచి వారసత్వంగా సముద్రలింగాపూర్ శివారులో సర్వే నంబర్ 471,472, 479లో 4.36 ఎకరాలు వచ్చింది. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పలు కారణాల వల్ల అప్పులయ్యాయి. కరోనా సమయంలో రాంరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత 2020లో సతీమణి మోతె లలితపైకి విరాసత్ అయింది. అప్పులు పెరుగడంతో కొంతభూమిని విక్రయించాలని నిర్ణయించుకున్న తల్లీకొడుకులు, ఇతరులకు అమ్మడానికి ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయడానికి తహసీల్ ఆఫీస్కు వెళ్తే.. సదరు భూమి 22ఏ కింద ఉన్నదని, అమ్మడానికి వీలు లేదని చెప్పడంతో వారు నివ్వెరపోయారు.
నిజానికి ఈ భూమిని గతంలో వారి పాలివారి నుంచి మోతె రాంరెడ్డి కొనుగోలు చేసాడు. ఆనాడు లేని 22ఏ ఇప్పుడు ఎలా వచ్చిందని అధికారులను అడిగితే.. సరైన సమాధానం లేదని బాధితులు వాపోతున్నారు. తమ పట్టా భూమిని ప్రభుత్వ భూమి అని తారుమారు చేశారని భూపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి నుంచి వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చడానికి కూడా తనకు అర్హత లేకుండా పోయిందని వాపోతున్నాడు. దీంతో కొనుగోలు చేసిన వారి నుంచి తీసుకున్న అడ్వాన్స్ వారికి తిరిగి ఇవ్వడానికి ఆరు నెలల గడువు కోరాడు. ప్రభుత్వం 22ఏలో తమ భూమిని పెట్టడం వల్ల సొంత పట్టా భూమి ఉన్నా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో అప్పు తీర్చలేక అవమానాలపాలు అవుతున్నామని కంటతడి పెడుతున్నాడు.