న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ సహా ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కేరళలో విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉన్నాయి. రాత్రి వేళ కూడా గంటలకొద్దీ విద్యుత్తు కోతలు విధించడం ఆ రాష్ట్ర దుస్థితిని వెల్లడిస్తున్నది.
పాలన చేపట్టిన కొన్ని నెలలకే రాష్ర్టాన్ని అంధకారం చేసిన కాంగ్రెస్ వైఖరిపై మండిపడుతూ కొవ్వొత్తులు పంచి విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. కాగా, విద్యుత్తు సమస్య ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేనంటూ సాక్షాత్తు ఆ శాఖ మంత్రే చేతులెత్తేశారు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్రంలోని తాగునీరు, విద్యుత్తు కొరతపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజలను సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎదుర్కోడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
విద్యుత్తు కోతలు ఎన్నాళ్లో చెప్పలేం: కేరళ మంత్రి
కేరళ రాష్ట్రంలో రోజురోజూకూ తీవ్రమవుతున్న విద్యుత్తు కోతల నుంచి బయటపడటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యుత్తు శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఎన్నాళ్లు సాగుతాయో చెప్పలేమని, సాధ్యమైనంత వరకు దీని నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్టీపీసీ నుంచి యూనిట్ రూ.30కు కొనుగోలు చేసే విషయమై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అంత భారీ వ్యయంతో విద్యుత్తును కొనుగోలు చేస్తే ఖజానాపై తీవ్ర భారం పడుతుందని ఆయన అన్నారు. దీనికి తప్పక మంత్రివర్గ ఆమోదం కావాలని అన్నారు.
465 మెగావాట్లను 25 ఏండ్ల పాటు యూనిట్‌కు రూ.4.26 నుంచి 4.29కు కొనుగోలు చేయాల్సిన కాంట్రాక్టు రద్దయ్యిందని, దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిందని, ఏసీలు, కూలర్ల వినియోగం ఎక్కువైందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గ సప్లయి ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్తు 25 శాతం రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోతున్నదన్నారు. విద్యుత్తు శాఖ చేపట్టడమంటే ముళ్లకిరీటం ధరించడమేనని సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంథోని తనను హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ముళ్ల కిరీటాన్ని పూల కిరీటంగా మారుస్తానని ఆయన అంటుండగానే మంత్రి సభలో కరెంట్ పోవడం విశేషం.
ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలి: డీకే
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని, రానున్న తాగునీరు, విద్యుత్తు కొరతపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వీటిని ఎదుర్కొనడానికి ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని మంగళవారం పిలుపునిచ్చారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకోవద్దని కోరారు. వర్షపాతం బాగా తగ్గుతున్నది. అయితే ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలు చేపట్టడంలో అర్థం లేదు.
మీకంటే ప్రభుత్వానికే దీనిపై ఎక్కువ అందోళన ఉంది. కొందరు వ్యక్తులు, విపక్ష పార్టీలు ఈ పరిస్థితిని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేస్తున్నదని, కేంద్రం పరిస్థితిని అంచనా వేసేటప్పుడు ఆ నివేదిక కచ్చితంగా ఉండాలని డీకే తెలిపారు. రాష్ట్రం కరువు పరిస్థితులను, విద్యుత్తు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నదని, అదే సమయంలో తాగునీటి సరఫరాను కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.