‘అపన్ తండేమా.. అపన్ రాజ్’తో ఆత్మగౌరవానికి అంకురార్పణ.. పోడు భూములకు పట్టాలు.. 10 శాతం రిజర్వేషన్.. గురుకులాలతో విద్యా విప్లవం. రైతుబంధు నుంచి గిరి వికాసం వరకు.. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు. స్వయం పాలన.. స్వయం ఉపాధి.. స్వయం సమృద్ధి దిశగా బీఆర్ఎస్ అడుగులు. నాడు కేసీఆర్ వేసిన బాట.. నేటికీ గిరిజన సంక్షేమానికి పునాది. తెలంగాణ గిరిజనుల చరిత్రలో కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఉత్తర్వులుగా మాత్రమే మిగిలిపోవు. అవి తరతరాలుగా ఎదురుచూసిన ఆకాంక్షలకు సమాధానాలవుతాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల జీవితాల్లో అలాంటి మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. గిరిజనుల రిజర్వేషన్ల ప్రస్థానంలో 2022 సెప్టెంబర్ 17 చారిత్రక ఘట్టం. గిరిజనులకు 10 రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించిన రోజు. గిరిజనులు, గిరిజన సంఘాలు సంబురాలకు సిద్ధమైన నేపథ్యంలో నాటి కృషిని స్మరించుకుందాం.
1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ ప్రాంత గిరిజనులు అనేక సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన వెనుకబాటుతనాన్ని ఎదుర్కొన్నారు. అనంతరం కేంద్ర చట్ట సవరణల ద్వారా వివిధ గిరిజన తెగలకు ఎస్టీ హోదా, రిజర్వేషన్ అవకాశాలు విస్తరించాయి. 1986లో ఎస్టీ రిజర్వేషన్ 4 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. కాలక్రమంలో తెలంగాణలో గిరిజన జనాభా వాటా పెరిగిన నేపథ్యంలో వారి అవకాశాలకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభా 3.5 కోట్లు. ఇందులో ఎస్టీలు 31.78 లక్షలు (9.08%)గా ఉన్నారు.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ చెల్లప్ప నేతృత్వంలో 2015 మార్చి 3న కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ చెల్లప్ప కమిషన్ 2016 డిసెంబర్ 8న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017 ఏప్రిల్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 16న అసెంబ్లీ ఆమోదించింది. 2017 మే 29న ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. 2018 ఆగస్టు 4న సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో 2019 అక్టోబర్ 4న ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం, సీఎం రాసిన లేఖలపై నిర్ణయం ప్రకటించాలంటూ 2021 ఫిబ్రవరి 4న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రానికి లేఖ రాసింది.
రాష్ట్రంలో ఎస్టీల రిజర్వేషన్లను పెంచడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని స్వీకరించినట్టు కేంద్ర గిరిజనశాఖ 2022 ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఫిబ్రవరి 11న రాష్ర్టానికి లేఖ అందింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఎస్.టి మురళీధర్‌రావుకు మధ్య జరిగిన 2020 కేసును ఉటంకిస్తూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుపై 2022 మార్చి 7న కేంద్ర హోంశాఖ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు లేఖ రాసింది.
గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలన్న కేసీఆర్ సంకల్పానికి కేంద్రం ఆమోదం తెలుపలేదు. ఏడేండ్లు నిరీక్షించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కీలకమైన, చారిత్రక నిర్ణయం తీసుకున్నది. 2022 సెప్టెంబర్ 17న హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపే నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను.. ఈ వేదిక నుంచి, తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. అయ్యా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంప్ కొట్టించి పంపించండి. మేం వెంటనే రిజర్వేషన్లు అమలు చేసుకుంటాం.
మాకు వచ్చే న్యాయపరమైన హక్కునే అడుగుతున్నాం. రిజర్వేషన్ల అంశంపై నేను స్వయంగా ప్రధానమంత్రి గారిని అడిగాను. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుమని కేంద్రాన్ని అడిగీ అడిగీ విసిగిపోయినం. ఇక విసిగిపోదలుచుకోలేదు. వారం రోజుల్లో రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవోను అమలు చేస్తాం’ అని తేల్చిచెప్పారు. ఈ విధంగా గిరిజన రిజర్వేషన్ల అంశంలో సెప్టెంబర్ 17 ప్రత్యేకత కలిగి ఉన్నది. కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు కసరత్తు పూర్తి చేసి, ప్రభుత్వం సెప్టెంబర్ 30న జీవో నంబర్ 33 జారీ చేసింది. ఈ జీవో ద్వారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అక్టోబర్ 1 నుంచి జీవో అమల్లోకి వచ్చాయి.
ఎస్టీ రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు ప్రాతినిధ్యం పెరిగింది. గణాంకాల ప్రకారం ఇంజినీరింగ్‌లో 3,195
అదనపు సీట్లు, వైద్య విద్యలో 189 అదనపు సీట్లు గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎన్నో రంగాల్లో గిరిజనులకు మేలు జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం 3,146 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా గుర్తింపు వచ్చింది. సుమారు 1.5 లక్షలకుపైగా గిరిజన రైతులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల హక్కు పత్రాలు అందించింది. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అదనపు భరోసా కల్పించింది. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 91 గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఏడేండ్ల వ్యవధిలోనే మరో 95 గురుకులాలను ఏర్పాటు చేసి, ఆ సంఖ్యను 186కు చేర్చింది. ఆశ్రమ పాఠశాలలను ఆధునీకరించడంతోపాటు 1,432 పాఠశాలల్లో ఆధునికీకరణ, 309 ఈస్టూడియోలు, 316 కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించింది. కేసీఆర్ ప్రభుత్వం ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించింది. మేడారం జాతర, సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి, నాగోబా జాతర, కుమ్రం భీం జయంతి, గాంధారి మైసమ్మ తదితర గిరిజన పండుగలకు అధికారిక గుర్తింపు, మద్దతు కల్పించింది.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
నింపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని తండా లు, గూడేల్లోని ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న గిరిజన రిజర్వేషన్ అమలు కోసం కేసీఆర్ ప్రకటన చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబురాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో హక్కులు, ఆత్మగౌరవం, భూమి, రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, స్వయం పాలనతో గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండితే.. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం నిర్వీర్యమవుతున్నది. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ హయాంలో గిరిజన గురుకులాలను విద్యా విప్లవానికి కేంద్రాలుగా తీర్చిదిద్దితే.. నేడు అదే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం గిరిజనుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
గిరిజనుల విద్య, వైద్యం, భూమి, రిజర్వేషన్లు, ఉపాధి, ఆత్మగౌరవం వంటి రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం వేసిన బలమైన పునాదులకు భిన్నంగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్ పాలనలో తమకు జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్న గిరిజనులు.. మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్.. మళ్లీ గిరిజన సంక్షేమం.. మళ్లీ స్వర్ణయుగం అనే ఆకాంక్ష బలంగా వినిపిస్తున్నది.
(వ్యాసకర్త: మాజీ మంత్రి )
సత్యవతి రాథోడ్