మురళీ ఓ మధ్యతరగతి ఉద్యోగి. నెలనెలా దుకాణంలో తీసుకొనే సరుకులకు యూపీఐ ద్వారానే చెల్లిస్తాడు. అయితే ఈ నెల మాత్రం వ్యాపారి నగదు ఇచ్చి తీసుకెళ్లమన్నాడు. సురేందర్ తన హోటల్‌కు కావాల్సిన కిరాణా సరుకుల్ని ఎప్పట్లాగే కొన్నాడు. కానీ ఈ నెల ఎప్పుడూ తెచ్చేవే అయినా బిల్లులో మాత్రం తేడా కనిపించింది. అవును.. ఇకపై మురళీ, సురేందర్‌లకు ఎదురైన పరిస్థితే మనలో చాలామంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఎండీఆర్ చార్జీలే ఇందుకు కారణం.
సుభాష్ చంద్రకు ప్రభుత్వం రూ.22,000 కోట్లు రద్దు చేయకపోతే వచ్చే 20 ఏండ్లదాక కూడా రూ.8,000 కోట్ల సర్కారీ సబ్సిడీతో దేశంలో యూపీఐ లావాదేవీలు ఫ్రీగానే నిర్వహించుకోవచ్చు. ఇక యూపీఐని నిర్వహిస్తున్న ఎన్పీసీఐ.. తమ బ్యాలెన్స్ షీట్లపై రూ.6,119 కోట్ల నగదు మొత్తాలను పెట్టుకున్నది. ఆదాయ పన్ను చెల్లించడానికి ముందు రూ.1,900 కోట్ల నిర్వహణ లాభాలను అందుకున్నది. దీన్నిబట్టి ప్రభుత్వ సాయం లేకుండానే ఎన్పీసీఐ సొంతంగా యూపీఐ లావాదేవీలను ఉచితంగా దేశ ప్రజలకు అందించవచ్చు. నిజానికి గత ఏడాది ఎన్పీసీఐ నుంచి ప్రభుత్వంపన్నుల రూపేణా రూ.1,000 కోట్లను వసూలు చేసింది. ఏదిఏమైనా పాలకుల తీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశ యూపీఐ విధానం ప్రమాదంలో పడుతున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారమయ్యాయి. రూ.2,000 దాటిన వ్యాపార లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను విధించింది. ఈ చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని అటు ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. నిజానికి 2020 నుంచి అన్నిరకాల యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే సాగుతూ వచ్చాయి. అయితే తాజాగా ఈ చెల్లింపులపై మోదీ సర్కార్ బాదుడు మొదలుపెట్టింది. వ్యక్తుల మధ్య యూపీఐ పేమెంట్స్‌కు ఈ చార్జీల నుంచి మినహాయింపునిచ్చిన కేంద్రం.. వ్యాపారులకు చేసే చెల్లింపులు రూ.2,000 వరకే ఉచితమని పరిమితి పెట్టింది. అంతకుమించిన చెల్లింపులపై గరిష్ఠంగా రూ.300దాకా ఎండీఆర్ చార్జీలను వడ్డించింది.
యూపీఐ వ్యాపార లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎండీఆర్ చార్జీలు.. చివరకు సామాన్యుడిపైనే భారం మోపుతాయన్న ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయిప్పుడు. కస్టమర్ల నుంచి వ్యాపారులు ఎండీఆర్ చార్జీలను వసూలు చేయకుండా బ్యాంకులు నిఘా వేయాలని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా.. ఆ మేరకు వస్తూత్పత్తుల ధరల్ని పెంచి దుకాణదారులు కొనుగోలుదారుల పొట్ట కొట్టడం ఖాయమన్న అభిప్రాయాలే ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ద్రవ్యోల్బణాన్ని ఎగదోసిన కేంద్రం.. ఇప్పుడు ఎండీఆర్ చార్జీల పేరిట మరింత ధరాఘాతానికి పాల్పడుతున్నదని ఆర్థిక నిపుణులూ ఆక్షేపిస్తున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, కృత్రిమే మేధస్సు దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో కుటుంబ ఆదాయాన్ని ఇంకా కుంగదీసే నిర్ణయాలు సరికావంటున్నారంతా.
ఇక పాత పెద్ద నోట్ల రద్దుతో యూపీఐ లావాదేవీలను గట్టిగా ప్రోత్సహించిన మోదీ సర్కార్.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో మళ్లీ నగదు లావాదేవీలకు ఊతమిస్తున్నదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా దుకాణాల్లో ఎండీఆర్ చార్జీలను తప్పించుకోవడానికి వ్యాపారులు నగదు లావాదేవీలకు ఒత్తిడి చేస్తున్నారు. రూ.100, 200 లావాదేవీలనూ తిరస్కరిస్తూ యూపీఐ క్యూఆర్ కోడ్లను దాచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్నిబట్టి నిన్నమొన్నటిదాకా పెద్ద ఎత్తున జరిగిన రూ.5, 10 లావాదేవీల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఇప్పటిదాకా జేబులో రూపాయి లేకున్నా దర్జాగా తిరిగినవారు.. ఇకపై ఆ జేబుల్ని నింపుకొనిగానీ బయటకు రాలేని దుస్థితి వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు.
ఎండీఆర్ అనేది కస్టమర్ (కిరాణా దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, సూపర్ మార్కెట్లలో) ప్రతిసారీ చేసే డిజిటల్ పేమెంట్కుగాను బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు సదరు వ్యాపారి చెల్లించే ఫీజు. ఉదాహరణకు భాను ఓ షాపులో రూ.2,500 విలువైన సరుకుల్ని కొన్నాడు. యూపీఐ (గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం తదితర యాప్స్) ద్వారా చెల్లించాడు. ఇందుకుగాను ప్రాసెసింగ్ ఫీజుగా రూ.10ని ఈ లావాదేవీలో భాగమైన బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు షాపు యజమాని చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం వరకు ఈ ఫీజు లేదు. కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది.
ఈక్విటీ మార్కెట్ ఆధారిత యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు స్టాక్ మార్కెట్ క్రయవిక్రయాలు, పెట్టుబడులను ప్రభావితం చేయగలవు. మళ్లీ సాధారణ పరిస్థితులు రావడానికి సమయం పట్టవచ్చు.
– ఆశీష్‌కుమార్ చౌహాన్, ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీల విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ఇందులో సెంట్రల్ బ్యాంక్ చేయదగినదేది లేదు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఎవరో ఒకరు ఆ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
– ఇటీవలి ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
