రంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇప్పటికే అసైన్డ్, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను పారిశ్రామిక అవసరాల పేరుతో సేకరణకు కుయుక్తులు వేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముద్విన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 179లో ఉన్న 620 ఎకరాల అసైన్డ్ భూములతోపాటు ఆ పక్కనే ఉన్న మరో నాలుగు వందల ఎకరాల పట్టా భూములనూ సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇప్పటికే ఆ భూముల్లో రైతులకు తెలియకుండా డ్రోన్ కెమెరాలతో అధికారులు సర్వే చేయడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్వాయిపల్లిలో ఇప్పటికే అధికారులు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికంగా భూములను సేకరించారు. ఈ రోడ్డు పక్కనే పారిశ్రామిక ప్రగతి పేరుతో మరో వెయ్యి ఎకరాలను సేకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కడ్తాల్ తహసీల్దార్ నుంచి అసైన్డ్ భూమితోపాటు చుట్టుపక్కల ఉన్న భూములను కలిపి వెయ్యి ఎకరాలకు సంబంధించిన సర్వే మ్యాప్‌లను అధికారులు ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలిసింది. గతకొన్ని రోజులుగా ఎక్వాయిపల్లి, ముద్విన్ గ్రామా ల్లో భూసేకరణ జరుపుతారన్న సమాచారంతో రైతులకు కంటిపై కునుకులేకుండా పోయింది.

జిల్లాలో కొనసాగుతున్న అసైన్డ్ భూముల సేకరణ
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, ఆమనగల్లు, షాద్‌నగర్, షాబాద్, మొయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర మండలాల్లో ఇప్పటికే అసైన్డ్ భూములను అధికంగా సర్కార్ సేకరించింది. ఇప్పటికే యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో 680 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడులో 600 ఎకరాలు, మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, జబ్బార్‌గూడ, మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల, యాచారం మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భూసేకరణ నిర్వహించి అసైన్డ్ భూములను సర్కార్ స్వాధీనం చేసుకునన్ది. తాజాగా ఎక్వాయిపల్లిలో వెయ్యి ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధమైంది.
621 ఎకరాల అసైన్డ్, 400 ఎకరాల పట్టా భూమి..
కడ్తాల్ మండలంలోని ముద్విన్ పంచాయ తీ పరిధిలో గల ఎక్వాయిపల్లి గ్రామంలో సర్వేనంబర్ 179లో 621 ఎకరాల ప్రభు త్వ భూమిని గతంలో రైతులకు అసైన్డ్ పట్టాలిచ్చారు. ఈ భూమితోపాటు పక్కనే ఉన్న పట్టా భూములు మరో 400 ఎకరాలనూ సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కడ్తాల్ తహసీల్దార్ ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించి సర్వే చేసి తయారు చేసిన మ్యాప్‌లను ఉన్నతాధికారులకు అందజేశారు.
ఈ భూములపై త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలున్నాయి. దీంతో ఎక్వాయిపల్లి, ముద్విన్ గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూములను తీసుకోవద్దంటూ ఇప్పటికే బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రాలు అందజేశా రు. కాగా, ఎక్వాయిపల్లిలో పారిశ్రామిక అవసరాల పేరుతో నోటిఫికేషన్ జారీ చేసి భూములను సేకరించాలని ప్ర భుత్వం కసరత్తు చేస్తున్నది. 621 ఎకరాల ప్రభుత్వ భూములతోపాటు గ్రామానికి చెందిన సుమారు మరో 30 సర్వే నంబర్లలో ఉన్న మరో 400 ఎకరాలనూ సేకరించాలని నిర్ణయించింది.
భూములు లాక్కుంటే బతికేదెలా..?
తాతల కాలం నుంచి భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. తమకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే తామంతా రోడ్డున పడాల్సిందే. తమ భూములను పారిశ్రామిక అవసరాల పేరుతో బలవంతంగా లాక్కోవటం సరికాదు. ప్రాణాలైనా ఇస్తాం. కానీ, భూములను మాత్రం వదిలిపెట్టం.
-పర్వతాలు, రైతు, ఎక్వాయిపల్లి
వ్యవసాయమే జీవనాధారం
గ్రామం పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న ది. ఇక్కడ అందరం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. అలాంటి తమ గ్రామంలో భూసేకరణ చిచ్చులేపటం సరి కాదు. ప్రభుత్వం పేద రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకుని జీవితాలను నాశనం చేయొద్దు.. తమను ఆగం చేయొద్దు.
-సాతిరి సురేందర్‌రెడ్డి, ఎక్వాయిపల్లి