కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసతిగృహం విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది. మూత్ర విసర్జన కోసం ఆరు బయటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందారని సిబ్బంది చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మూత్రశాలలు ఉంటే పిల్లలు ఎందుకు బయటికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. అలాగే బడి చుట్టూ కనీసం ప్రహరీ ఉన్నా పిల్లలు బయటికి వెళ్లే వారు కాదని, ఇలా ప్రాణాలు కోల్పోయే వారు కాదని ఆవేదన చెందుతున్నారు.
జగిత్యాల, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) / మల్యాల : మల్యాల పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో సమీకృత వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థులు సమీపంలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వసతి గృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుతున్న జగిత్యాల అర్బన్ మండలం తారక రామానగర్‌కు చెందిన జగన్నాథ సుశాంత్ (10), ఐదో తరగతి చదువుతున్న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన వనం విష్ణు (11) సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉపాధ్యాయుడు విఠల్‌ను మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్తామని అనుమతి కోరారు.
పాఠశాలలో ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగించలేని పరిస్థితిలో ఉండడంతో ఉపాధ్యాయుడుసైతం విద్యార్థులు ఆరుబయటకు వెళ్లేందుకు అనుమతించాడు. అయితే ఆ ఇద్దరు పిల్లలు అరగంట గడిచినా తిరిగి రాకపోవడంతో వసతిగృహానికి వెళ్లి ఉండొచ్చని భావించాడు. వెంటనే పాఠశాలలో ఉన్న ఇద్దరు ముగ్గురు విద్యార్థులను అక్కడకు వెళ్లి చూసి రావాలని పంపించాడు. అక్కడ వార్డెన్ లక్ష్మీనర్సయ్యను కలిసి, విష్ణు, సుశాంత్ మూత్ర విసర్జనకు వెళ్లి రాలేదని చెప్పడంతో వార్డెన్ కంగారు పడ్డాడు. ఆందోళనకు గురైన ఉపాధ్యాయుడు, వార్డెన్‌తోపాటు విద్యార్థులు పాఠశాల, వసతిగృహాల సమీపంలో వెతికారు.
స్కూల్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న కొత్తకుంట చెరువు వద్ద ఇద్దరు పిల్లల దుస్తులు కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని మల్యాల కార్యదర్శి శ్రీకాంత్‌కు అందించారు. శ్రీకాంత్ సిబ్బందిని తీసుకొని వెళ్లి, కొత్తకుంట చెరువులో వెతికించినా చిన్నారుల ఆచూకీ దొరకలేదు. దీంతో మల్యాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మల్యాల సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ సందీప్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని.. మొదట గంగపుత్రులతో వెతికించారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో కొండగట్టు పుణ్యక్షేత్రంలోని గజఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేయించారు. దాదాపు అరగంటపాటు శ్రమించిన తర్వాత ఊబిలో ఇరుక్కుపోయిన చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు.

మూత్రశాలలు ఉంటే బయటికి ఎందుకెళ్లారు?
పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటల వరకు పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఆరుబయటకు ఎందుకు వెళ్లారు? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పాఠశాలకు సంబంధించిన మూత్రశాలలు పక్కనే ఉన్నాయని ఉపాధ్యాయుడు, మండల విద్యాధికారి చెబుతుండగా, అయితే బయటికి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల దుస్తులు కొత్తకుంట చెరువు పక్కన కనిపించాయని, పిల్లల చొక్క, నెక్కర్లతోపాటు తువ్వాల సైతం ఉందని టీచర్, వార్డెన్ చెబుతున్నారు. స్కూల్‌కు వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి, పర్మిషన్తో వెళ్లిన విద్యార్థుల వద్దకు తువ్వాల ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతున్నది. అయితే వసతిగృహంతోపాటు పాఠశాల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న కొందరు చెప్పిన ప్రకారం.. నాలుగైదు రోజులుగా వసతిగృహానికి చెందిన విద్యార్థులు కొత్తకుంట చెరువులో ఈత కొడుతున్నారు. విష్ణు, సుశాంత్ హాస్టల్‌కు వెళ్లి, టవల్ తీసుకొని వచ్చి, ఈత కోసం చెరువులో దిగి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఆగ్రహించిన తల్లిదండ్రులు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మృతి సమాచారం అందగానే కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రధాన దవాఖానకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. తమ కండ్ల ముందు తిరిగిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండడంతో గుండెలవిసేలా రోదించారు. ఎన్నో ఆశలతో సర్కారు హాస్టల్‌కు, స్కూల్‌కు పంపించిన తమ పిల్లలు చెరువులో ఎలా శవాలై కనిపిస్తారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ అంటూ ఆగ్రహించారు. మండల కేంద్రానికి దూరంగా జనవాసాలు లేని చోట వసతిగృహాన్ని, పాఠశాలను ఏర్పాటు చేయడమే పెద్ద తప్పని మండిపడుతున్నారు. కనీసం పర్యవేక్షణ సైతం కరువైందని మండిపడ్డారు. సమీపంలోనే చెరువులు, కుంటలు, పెద్దపెద్ద చెట్లు ఉన్నాయని, విషసర్పాల సంచారం సైతం ఉంటుందని వాపోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా ఉన్న పాఠశాలకు ప్రహరీ లేకపోవడం కూడా కారణమని వాపోతున్నారు. ప్రహరీతోపాటు గేటు నిర్మించి ఉంటే ఈ రోజు తమ పిల్లలు బయటికి వెళ్లేవారు కాదని, ఈ ప్రమాదం జరిగేది కాదని రోదిస్తున్నారు. కాగా, సుశాంత్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ఒకరు మహారాష్ట్రలో ఉండగా, మరొకరు హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం.
దవాఖాన వద్ద బందోబస్తు
మృతదేహాలను జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానకు తరలించగా, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డితో పాటు రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీస్ ఫోర్స్‌ను మోహరింపజేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా బందోబస్తు చేపట్టారు. ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో మాట్లాడి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఎలాంటి నిరసనలకు దిగవద్దని సూచించినట్టు తెలుస్తున్నది. మృతదేహాలకు మంగళవారం ఉదయం పోస్టుమార్టం చేసి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయుడి నుంచి ఒక ఫిర్యాదు, వసతిగృహానికి చెందిన వార్డెన్ లక్ష్మీనర్సయ్య వద్ద నుంచి ఒక ఫిర్యాదు, చిన్నారుల కుటుంబ సభ్యుల వద్ద నుంచి ఇంకో ఫిర్యాదును తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశాలు
ఇద్దరు విద్యార్థుల మృతి అత్యంత విషాదకరమని కలెక్టర్ సత్యప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వచ్చి, బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థులు విరామ సమయంలో ఎవరికి సమాచారం ఇవ్వకుండా పాఠశాల ఆవరణ నుంచి బయటకు వెళ్లారని తెలిపారు. కొంత సేపటి తర్వాత వారు తిరిగి రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. పాఠశాల, హాస్టల్‌కు సమీపంలోని కొత్తకుంట చెరువు వద్ద విద్యార్థుల దుస్తులు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రమాదం కాదు.. యంత్రాంగం నిర్లక్ష్యమే
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
వడ్డెర కాలనీలోని ప్రభుత్వ వసతిగృహానికి చెందిన ఇద్దరు పిల్లల మృతిపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మృతి కేవలం ప్రమాదం కాదని, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. హాస్టల్ వెనుక ప్రమాదకరమైన కుంట ఉన్నప్పటికీ కంచె, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని మండిప్డడారు. కనీస భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు నిలిచేవని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు, వసతి గృహాలు, హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఘటనలు సర్కారు వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి అట్టర్లీ ఫ్లాప్ అయాడని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.