తన అందచందాలతో నిత్యం వార్తల్లోకెక్కే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన స్థాయిని హాలీవుడ్ వరకు విస్తరించుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాల ఎంపిక, హాలీవుడ్ ప్రాజెక్ట్ విశేషాలను పంచుకుంది. త్వరలోనే ‘హోలీగార్డ్స్ సాగా- ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ అనే హాలీవుడ్ చిత్రంలో కనిపించనుంది. ఇందులో ‘జెస్సికా’ అనే కీలక పాత్ర పోషిస్తున్నది. దిశా ఈ ప్రాజెక్ట్ గురించిన విశేషాలను పంచుకుంటూ.. ఆడిషన్ ప్రక్రియ నుంచి షూటింగ్ వరకు ప్రతీ క్షణాన్ని ఎంతో ఆస్వాదించినట్లు తెలిపింది. ప్రాజెక్ట్ రేంజ్ గురించి కాకుండా.. తన నటనపై మాత్రమే పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టం చేసింది.
కొత్త ప్రయాణంలో ఒత్తిడి సహజమే అయినప్పటికీ, దానిని పకన పెట్టి పనిలో అనుభవాన్ని పొందేందుకే ప్రాధాన్యం ఇస్తానని పేరొంది. ‘గ్లామర్ అనేది నా వృత్తిలో ఒక భాగం మాత్రమే. కానీ, ఒక నటిగా నా అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలని అనుకుంటాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులతో పనిచేయడం, పూర్తిగా భిన్నమైన సెటప్‌లో చిత్రీకరణ జరుపుకోవడం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చినట్లు ఈ బ్యూటీ తన అభిప్రాయాలను పంచుకున్నది. ఈ హాలీవుడ్ ప్రయాణం తనను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకువచ్చిందని, భవిష్యత్తులో కూడా తనలోని రకరకాల భావోద్వేగాలను, నటనలోని కొత్త కోణాలను వెలికితీసే విలక్షణ పాత్రలనే ఎంచుకోవడానికి ఇదో ప్రేరణగా నిలిచిందని దిశా అభిప్రాయపడింది.