ప్రపంచస్థాయి సాంకేతికతతో ‘అల్లు సినిమాస్’ను నిర్మించామని, నగరంలోకి తొలి డాల్బీ సినిమా వచ్చిందన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. హైదరాబాద్ కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ కాంప్లెక్స్ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘అల్లు సినిమాస్’ అందించే ఎక్స్పీరియన్స్ గురించి అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్లలో ఒకటిగా అల్లు సినిమాస్ రికార్డు క్రియేట్ చేసిందని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘మల్టీఫ్లెక్సుల కంటే ఎక్కువ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ కాంప్లెక్స్‌ను ప్రారంభించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది.. వినిపిస్తుంది. విజువల్స్, సౌండ్ పరంగా అత్యున్నతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రదించి ఈ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాం. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోని అతిపెద్ద స్క్రీన్లలో ఒకటి. దేశంలో అల్లు సినిమాస్ ఓ మైలురాయిలా నిలుస్తుంది’ అని చెప్పారు.