కొత్తగూడెం టౌన్, జూలై 28; (నమస్తే తెలంగాణ): కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి (PD) గా పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక సుజాతనగర్ నివాసం ఉంటున్న ఆయన పాఠశాల విధులు ముగించుకుని, బైక్‌పై ఇంటికి వస్తుండగా అనుకోకుండా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించినా అప్పటికే యుగంధర్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా రోజూ విధులకు వెళ్లి వచ్చే చింతలపూడి యుగంధర్ హఠాత్తుగా కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన విధులు ముగించుకొని బండిపై ఇంటికి వస్తుండగా.. డేగలమడుగు ఆంజనేయస్వామి గుడి వద్ద గుండెనొప్పి వచ్చి కిందపడిపోయాడు. వెనుకాలే ఆటోలో వస్తున్న తోటి ఉపాధ్యాయులు కల్యాణి, బంధువు కృష్ణలు యుగంధర్‌ను గమనించి సీపీఆర్ (CPR) చేశారు.
అనంతరం 108కు సమాచారమిచ్చి.. అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ యుగంధర్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. యుగంధర్ హఠాన్మరణంపై మృతుడి సోదరుడు చింతలపూడి రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజాతనగర్ SI M. రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.