హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలా ఉండాల్సిన సచివాలయం రెండో అంతస్తులో అనధికారిక నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉండే ఆరో అంతస్తుకు వెళ్లడానికంటే ఎక్కువ ఆంక్షలు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉండే రెండో అంతస్తులో అమలవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండో అంతస్తుకు వెళ్లడానికి సెక్రటేరియట్ సిబ్బందితోపాటు మీడియాకు కూడా కఠిన ఆంక్షలు విధించినట్టు పలువురు వాపోతున్నారు.
రెండో అంతస్తులోని భద్రతా సిబ్బంది లిప్టుల వద్దే బాధితులను అడ్డుకుంటున్నారు. ‘ఎవరు మీరు? ఎవరిని కలువాలి? కలవాల్సిన వారికి ఫోన్చేయండి? వాళ్లు రమ్మంటేనే వెళ్లండి? భట్టిగారి పేషీకి అనుమతి లేదు.. మంత్రిగారు పిలిస్తే ఫోన్లు డిపాజిట్ చేసి వెళ్లండి’ అంటూ పోలీసు సిబ్బంది ఆదేశిస్తున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ వచ్చే కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి మొర్రో అని వేడుకొనే విశ్రాంత ఉద్యోగులను సైతం రెండో అంతస్థుకు అనుమతించడం లేదనే ఆరోపణలున్నాయి. కొందరికి టోకెన్లు ఇస్తున్నా బిల్లులు మాత్రం క్లియర్ కావడం లేదని ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, ఆర్థిక మంత్రికి చెప్పుకొందామని వస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సచివాలయంలోకి ఎవరు రావాలి? ఎవరిని ఎకడి వరకు అనుమతించాలి? అనే దానిపై భద్రతా నిబంధనలు ఉండటం సహజమే. కానీ, ప్రజా సమస్యలను పరిషరించాల్సిన వ్యవస్థలు పట్టించుకోకపోతే, బాధలు వినే మార్గాలు మూసుకుపోతే ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటాయి. వేరే కారణాలు చెప్తూ మూడంచెల భద్రతా వలయాన్ని దాటి ఇటీవల కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, స్వీపర్లు ఇలా ఒకో వర్గం ఒకో సమస్యతో భట్టి చాంబర్ వైపు దూసుకొచ్చి నిరసనలు చేపట్టింది.
అంటే సమస్య ఒకరోజుదీ కాదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. బాధితులు పెరుగుతున్నారు. నిరసనలు సచివాలయం గుమ్మం దాటి మంత్రుల చాంబర్ల వరకు వస్తున్నాయి. చాంబర్ల చుట్టూ భద్రత పెంచడం ద్వారా తాతాలికంగా నిరసనలను అడ్డుకోవచ్చు. కానీ బకాయిలు, వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
సచివాలయంలోని భట్టి చాంబర్ వద్ద బాధితుల లైను పెరిగిపోతుండగా, మరోవైపు విక్రమార్క పేషీలో పనిచేసేవారి వరుస మరణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన పేషీలో పనిచేసిన నలుగురు సిబ్బంది ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. భట్టి పీఏ శేషగిరి, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన తక్కళ్లపల్లి శ్రీనివాస్, సీపీఆర్వో మారబోయిన మధుసూదన్, ఇటీవలే ఆ శాఖ ఉద్యోగి కే కృష్ణమోహన్ రాజు గుండెపోటు చనిపోయారు. భట్టి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై ఉండే పని ఒత్తిడి, విధుల స్వభావం, పని గంటలు, నిరంతరం అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులు వంటివి మరణాలకు కారణమా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి.