హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): వేతన సవరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందన్న ఆగ్రహం ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతున్నది. 39 నెలలుగా ఉద్యోగులు పీఆర్సీకి నోచుకోలేకపోయారు. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన మధ్యంతర భృతితోనే ఉద్యోగులు ఉపశమనం పొందుతున్నారు. మూడేండ్లుగా వేతన సవరణ లేకపోగా.. ఈ ఐఆర్‌తో తాత్కాలికంగా ఊరడింపు పొందుతున్నారు. రెండో పీఆర్సీ అమలైతే ఉద్యోగులకు ఎంతోకొంత లాభం జరిగేది. కానీ, కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో పీఆర్సీ పత్తాలేకుండా పోయింది. చివరికి కేసీఆర్ ఇచ్చిన ఐఆర్ మాత్రమే ఉద్యోగులను ఆదుకున్నదని నేతలంటున్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 1 జూలై 2023 నుంచి తెలంగాణ రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. ఫిట్మెంట్ సిఫార్సు కోసం గత కేసీఆర్ సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ అధ్యక్షతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఈ కమిటీకి గడువుగా విధించింది. అయితే, ఒకటో పీఆర్సీకి, రెండో పీఆర్సీకి మధ్య జరిగే నష్టాన్ని పూడ్చేందుకు కేసీఆర్ సర్కార్ 5% మధ్యంతర భృతిని ప్రకటించింది.
2023 అక్టోబర్ 2న ఐఆర్ ప్రకటిస్తూ జీవో-133 జారీచేసింది. అక్టోబర్‌లో పొందే బేసిక్ పే నుంచే ఐఆర్ వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పొందుతున్న బేసిక్ పేకు అదనంగా 5% వేతనాలు పొందుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 5% ఐఆర్తోనే ఉద్యోగులు మూడేండ్లుగా సాం త్వన పొందుతున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
వాస్తవానికి పీఆర్సీ నివేదిక వచ్చి ఫిట్మెంట్ అమలయ్యే వరకే ఐఆర్ వర్తిస్తుంది. పీఆర్సీ నివేదిక సమర్పణకు కేసీఆర్ సర్కార్ ఆరు మాసాల గడువు విధించింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పీఆర్సీ కమిటీ గడువులను పొడిగించుకుంటూ వెళ్తున్నది. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో పొడిగిస్తున్నారని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నివేదిక సిద్ధమైనా, నివేదికను ఇచ్చేందుకు కమిటీ రెడీగా ఉన్నా కాంగ్రెస్ సర్కార్ స్వీకరించడంలేదనే ఆరోపణలున్నాయి.
మొన్నటికి మొన్న నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని పీఆర్సీ కమిటీకి సీఎస్ లేఖ కూడా రాశారు. పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పిస్తామని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరితే మాత్రం గప్‌చుప్ అయ్యారు. పీఆర్సీ రిపోర్ట్‌ను స్వీకరించేందుకు కూడా సర్కార్ ముందుకు రాకపోవడంతో.. రిపోర్ట్‌ను ప్రభుత్వం తెపించుకోవాలని ఉద్యోగ సంఘాలు ఉద్యమించాల్సి వచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ మోసాన్ని, కేసీఆర్ చేసిన మేలును ఉద్యోగులు బేరీజు వేసుకుంటున్నారు.