హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి మొత్తం రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం మాత్రమే కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉన్నది. రెండో సీటు గెల్చుకొనేందుకు తగినంత ఓటు బలం లేకున్నా, బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రెండు సీట్లూ గెలవడానికి కాంగ్రెస్‌కు 82 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం ఆ పార్టీకి సీపీఐ మద్దతుతో కలుపుకొని 67 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయినా మొండిగా రెండో అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన చేస్తుండటంతో రాష్ట్రంలో మరోసారి ప్రజాస్వామ్య హననం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికార పార్టీ మళ్లీ ‘ఓటుకు నోటు’ వ్యవహారానికి తెగబడే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేల (కాంగ్రెస్ 66+ సీపీఐ 1) మద్దతు ఉన్నది. రాజ్యసభ ఎన్నికల ఫార్ములా ప్రకారం… ఒక్కో ఎంపీ స్థానం గెలవడానికి 40.66 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ఈ లెక్కన ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రం గెలువగలుగుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌తో రాష్ట్రంలో స్నేహపూర్వక పార్టీగా ఉంటున్న ఎంఐఎం రాజ్యసభ ఎన్నికలకు సహకరిస్తుందా? లేదా? అన్నది చూడాలి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తాము మద్దతు ఇస్తే, ప్రతిగా తమకు కనీసం ఒక్క ఎమ్మెల్సీ సీటు అయినా ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతున్నట్టు తెలిసింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఎంఐఎంతో రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఏదైనా ఖాళీ అయితే ఎంఐఎంకు వచ్చేందుకు సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎంఐఎంతో అంతర్గత ఒప్పందం జరిగితే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తారు. ఎంఐఎం మద్దతు ఇస్తే, కాంగ్రెస్ అభ్యర్థులకు చెరో 37 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరకుతుంది. అయినప్పటీకీ, ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. ఈ నలుగురిని ఎక్కడినుంచి తీసుకుకొస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ స్థానాలను గెలిపించుకునే బలం లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసే విధంగా ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. వీళ్లు ఇప్పుడు కాకుంటే మరెప్పుడు పార్టీకి ఉపయోగపడుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. ఇందులో10 మంది గోడ దూకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, స్పీకర్ విచారణ సమయంలో అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. వారి బుకాయింపునకు తగ్గట్టే ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు చెప్పారు. మరో ఇద్దరి విచారణ కూడా గురువారం చేపట్టనున్నారు. వీరిపై తీర్పు కూడా ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు. వారు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో పదిమంది ఓట్లు తమకే లభిస్తాయని, ఈ పదిమంది ఓట్లతో తాము గట్టెక్కుతామని కాంగ్రెస్ భావిస్తున్నది.
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే మరోసారి న్యాయపోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ విప్ జారీ చేస్తే తమకు మరింత ఇబ్బందులు తప్పవని, ఇక్కడ స్పీకర్ తమకు ఇప్పటికిప్పుడు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ, ఫిరాయింపు ఎన్నికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద ఆయుధం అవుతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ అనేది ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నిక. సీక్రెట్‌గా ఓటు వేసి వచ్చేందుకు అవకాశం లేదు. కచ్చితంగా ఓటు ఎవరికి వేస్తున్నామో తమ పార్టీకి చెందిన ఎన్నికల ఏజెంట్‌కు చూపించి ఓటేయాల్సి ఉంటుంది. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టుగా మారింది.
అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సునాయాసంగా దకుతుంది. సొంతంగా గెల్చుకున్న 66 స్థానాలకు తోడు సీపీఐ సభ్యుడితో కలిపి కాంగ్రెస్‌కు 67 స్థానాల బలం ఉన్నది. 40 మంది మొదటి ప్రాధాన్యం ఓట్లతో ఒక అభ్యర్థి గెలిస్తే, రెండో అభ్యర్థి గెలుపు కోసం మిగిలిన 27 మందితోపాటు మరో 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో ఎంఐఎం, బీజేపీ సభ్యులను తమవైపు తిప్పుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహం పన్నుతున్నారు. బీజేపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్తున్నారు. అయితే, వారు తమ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి కాంగ్రెస్‌కు మద్దతుగా ఓటేయలేరని భావిస్తున్నారు. అయితే, ఓటింగ్‌కు గైర్హాజరైతే పరోక్షంగా తమకు సహకరించినట్టు అవుతుందని కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యేలతో చెప్తున్నట్టు సమాచారం.
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించితే ,కాంగ్రెస్ పార్టీ రెండో సీటును దక్కించుకోవడం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీకి కావాల్సిన 40 ఓట్ల కోటా ప్రకారం ముగ్గురు మాత్రమే తక్కువగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌లోని అసంతృప్తి ఎమ్మెల్యేలు సహకరిస్తే గెలుపు సునాయసం అవుతుంది. ఒకవేళ ఎంఐఎం సహకరిస్తే బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకలా మారుతుంది. బీజేపీ కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే, రెండో సీటును బీఆర్ఎస్ గెల్చుకోవడం కష్టం కాదు.