కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం లేక ప్రజానీకం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులు.. వంకలు ఉప్పొంగి రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, బయటకు రాలేని దుస్థితి నెలకొంటోంది. అటవీశాఖ అనుమతులు లేక సుమారు 30 రోడ్లు అర్ధాంతరంగా నిలిచిపోగా, అనేక చోట్ల వంతెనలు సైతం అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణం కష్టతరమవుతున్నది. ఇక అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ప్రాణాలు పోయిన ఘటనలుండగా, పట్టించుకునే నాథుడు లేడంటూ గిరిజనం మండిపడుతున్నది. కేసీఆర్ సర్కారులో 40 వరకు వంతెనలు.. రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరచగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే.. ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పిల్లర్లకే పరిమితం..
కెరమెరి మండలం అనార్పల్లి వద్ద వాగుపై వంతెన పిల్లర్లకే పరిమితం కాగా, గోండుగూడ, అనంద్గూడ, బోరిలాల్ గూడ, జన్కాపూర్తో పాటు కరంజివాడ గ్రామ పంచాయితీ పరిధిలోని పదుల సంఖ్యలో గ్రామాలకు రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పెద్ద తేడాలేకుండా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నడుములోతు నీళ్లలో వాగు దాటాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. వర్షాకాలంలో అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సిన దుస్థితి నెలకొంటున్నది. వర్షాకాలం వచ్చిందంటే దాదాపు మూడు నెలల పాటు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.

గుండి వాగుపై వంతెన నిర్మాణం ఎప్పుడో..!
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న గుండి వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 5 కోట్లతో రీ ఎస్టీమేట్ మూడేళ్ల క్రితం చేశారు. తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభించలేదు. ఎన్నికల కోడ్ ముగిసి రెండున్నరేళ్లుదాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకూ పనులు ప్రారంభించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండి గ్రామంతో పాటు భీంపూర్, కన్నెరగాం, దుబ్బగూడ, మరో ఆరు గ్రామాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవలకు సైతం ఈ గ్రామాలు నోచుకోవడం లేదు.
ఇక మారుమూల మండలాలైన తిర్యాణి, లింగాపూర్ మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చింతలమానెపల్లి మండలంలోని బాబాసాగర్, నాయికపు గూడ మధ్య వాగుపై వంతెన లేకపోవడం కేతిని- దిందా మధ్యన ఉన్న వాగు, రణవెల్లి- టేకం గూడ మధ్యనున్న వాగులపై వంతెనలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వాగులు పొంగితే తగ్గే వరకూ ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. బెజ్జూర్ మండలం తాలాయి, తిక్కల్లి, భీమారం వాగులు ప్రమాదకరంగా మారాయి. దహెగాం మండలం మెర్లిగూడ, కొత్మీర్- దుబ్బగూడ మధ్య, ఐనం వద్ద ఉన్న రెండు వాగులపై ఉన్న లోలెవల్ వంతనలు, దహెగాం- కల్వాడ వాగుపై వంతెనలు లేకపోవటంతో అనేక గ్రామాలకు వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తిర్యాణి మండలం గుండాల, మంగి గ్రామాలకు రహదారులు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి వంతెనలతో పాటు దారులను నిర్మించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.