రంగారెడ్డి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు గత బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన మెడికల్ కళాశాల భవిష్యత్తు అయోమయం, అగమ్యగోచరంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను కేటాయించగా.. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ఖాన్పేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ. వంద కోట్లతో నిర్మించేందుకు అప్పటి మంత్రి హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డిలు శంకుస్థాపన కూడా చేశారు.
కానీ, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో.. ఆ స్థలం మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుకూలం కాదంటూ నిర్మాణ పనులను నిలిపేసింది. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం మెడికల్ కళాశాలను మంగల్‌పల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భవనాన్ని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనానికి సరిగ్గా అద్దె ఇవ్వటంలేదంటూ యాజమాన్యం ఇప్పటికే భవనానికి రెండుసార్లు తాళం కూడా వేసింది. లీజ్ అగ్రిమెంట్ కూడా ముగియడం తో భవనాన్ని ఖాళీ చేయాలని యాజమాన్యం చెబుతున్నట్టు సమాచారం. దీంతో మహేశ్వరం మెడికల్ కళాశాలను ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ముగ్గురు వైద్యులతో ప్రత్యేక కమిటీ
ప్రస్తుతం మంగల్‌పల్లిలో అద్దె భవనంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాలను ప్రభుత్వం గత్యంతరం లేక మరోచోటుకి మార్చాలని భావిస్తున్నది. ఇందుకోసం మహేశ్వరం మెడికల్ కళాశాలకు చెందిన ముగ్గురు డాక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నగరంలోని కర్మన్‌ఘాట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మెడికల్ కళాశాల కోసం అనువైన భవనాన్ని అన్వేశిస్తున్నది. కాగా, ప్రస్తుతం మంగల్‌పల్లిలో కొనసాగుతున్న భవనానికి రూ.15 లక్షల వర కు అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అద్దెపై అదనంగా మరో 15శాతం పెంచి చెల్లిస్తున్నట్టు సమాచారం. బహిరంగ మార్కె ట్లో ఎక్కడా లేని విధంగా అద్దెను చెల్లించడం కంటే ఆ భవనా న్ని ఖాళీ చేసి మరో అద్దె భవనంలోకి వెళ్లటమే మంచిదని వైద్యులు భావిస్తున్నారు.
కేసీఆర్‌కు మైలేజీ వస్తుందనే..
మహేశ్వరం మెడికల్ కళాశాలకు గత బీఆర్ఎస్ ప్రభు త్వం మీర్ఖాన్పేట వద్ద వంద ఎకరాల భూమిని కేటాయించడంతోపాటు నిధులను విడుదల చేసింది. అయితే ఆ సంస్థలో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తే బీఆర్ఎస్కు మైలేజీ వస్తుందనే కుట్రతో ఆ భూమి కళాశాలకు అనువుగా లేదని కావాలనే రేవంత్ సర్కార్ నిలిపేసిందన్న ఆరోపణలున్నాయి. మీర్ఖాన్పేటలో భవనాన్ని నిర్మిస్తే ప్రభుత్వం ప్రకటించిన ఫ్యూచర్‌సిటీ లో వంద పడకల ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి అయ్యే ది. కానీ, ప్రభుత్వ కక్షసాధింపు ధోరణితో నిర్మాణం నిలిచిపోయింది.
కొత్తపేట కిమ్స్‌కు మార్చాలని..
కొత్తపేటలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) భవన నిర్మాణం పూర్తయితే ఈ మెడికల్ కళాశాలను అక్కడికి మార్చాలని సర్కార్ యత్నిస్తున్నది. కొత్తపేటకు ఈ మెడికల్ కళాశాలను మార్చితే జిల్లాల వారికి అనువుగా ఉండదని పలువురు స్పష్టం చేస్తున్నారు. మీర్ఖాన్పేటలో మెడికల్ కళాశాలను నిర్మిస్తే ఇబ్రహీంప ట్నం, మహేశ్వరం, రాజేంద్రగనగర్, షాద్‌నగర్, కల్వకుర్తి వంటి ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని భావించే గత కేసీఆర్ ప్రభు త్వం మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీర్ఖాన్పేట్లో మహేశ్వరం మెడికల్ కళాశాలను నిర్మించాలని కోరుతున్నారు.