డీజీపీ కార్యాలయంలో ఇటీవల హెడ్‌కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ పోలీస్ వ్యవస్థను నిలదీస్తున్నది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, మానసిక సమస్యలు, బెట్టింగ్ వ్యసనాలతో కేవలం 33 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 35 మంది పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితికి అద్ధం పడుతున్నది. రాష్ట్రంలో హోమ్ శాఖను సైతం పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం, పోలీస్ వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేయడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఫలితంగా పోలీస్ సిబ్బంది ఆత్మహత్యల్లో తెలంగాణ రికార్డులకు ఎక్కబోతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసులకు ధైర్యం చెప్పాల్సిన ఉన్నతాధికారులే పిట్టల్లా రాలిపోతున్నారు. జీవితంపై విరక్తి చెందడంతోపాటు ఉద్యోగంలో ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక రుగ్మతలు, బెట్టింగ్‌లు, ఇతర వ్యవసనాల పాలై సర్వీసు రివాల్వర్లతో కాల్చుకుని కొందరు, పురుగుమందులు తాగి మరికొందరు, ఉరి వేసుకుని ఇంకొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో తమ కుటుంబాలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారు.
అలా కాంగ్రెస్ సర్కార్ 33 నెలల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 36 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై హోమ్ శాఖను సైతం నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కనీసం చీమకుట్టినంత బాధ కూడా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించే క్షేత్రస్థాయి సిబ్బంది మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన భద్రత, వ్యక్తిగత సంక్షేమం సమాజ స్థిరత్వానికి అత్యంత ముఖ్యం.
కానీ, రాష్ట్రంలో 2024 జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలను పరిశీలిస్తే..
క్షేత్రస్థాయి సిబ్బంది సంక్షేమం, వారి బాధలు కాంగ్రెస్ సర్కార్‌కు ఏమాత్రం పట్టనట్టే కనిపిస్తున్నది. కానిస్టేబుల్ మొదలుకొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధనలు, అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 2024 జనవరి నుంచి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ సిబ్బందిలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు అధికంగా ఉండటం కలవరపెడుతున్నది.
రాష్ట్రంలో సాధారణ ప్రజలతోపాటు అనేక మంది పోలీసులు సైతం ఈజీ మనీకి అలవాటు పడి, బెట్టింగ్ వ్యసనాల్లో ముగినితేలుతున్నారు. ఆ బెట్టింగ్‌ల కోసం ఆన్లైన్ లోన్ యాప్‌లను ఆశ్రయించడం, తద్వారా అప్పుల భారం పెరుగడం, భార్యాబిడ్డల బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముతో కనీసం వడ్డీలైనా కట్టలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం, ఈ సమస్యలు చాలవన్నట్టు ఉన్నతాధికారుల వేధింపులు, మానసిక ఇబ్బందులు, వ్యసనాల బారినపడి నిర్దాక్షిణ్యంగా తనువు చాలిస్తున్నారు. అయినప్పటికీ పోలీస్ సిబ్బందిలో మానసిక ైస్థెర్యాన్ని నింపేందుకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


