హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కొత్త పీఆర్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏకంగా 70 వేల మంది ఉద్యోగులకు పీఆర్సీ కోత పెట్టనున్నది. పీఆర్సీ కమిటీకి సర్కార్ పంపించిన ఉద్యోగుల సంఖ్యలో ఈ 70 వేల మందిని మినహాయించినట్టు సమాచారం. వీరంతా 2004 తర్వాత నియమితులైన వారే కావడం గమనార్హం. దీంతో ఈ 70 వేల మందికి కొత్త వేతన సవరణ వర్తించడం అనుమానంగానే కనిపిస్తున్నది.
దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇస్తున్న రెండో పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ నెలకొన్నది. తెలంగాణ పీఆర్సీ నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 16వ తేదీలోపు ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతమంది ఉన్నారన్న వివరాలను ప్రభుత్వం పీఆర్సీ కమిటీకి సమర్పించింది. ప్రస్తుత మాస్టర్ స్కేళ్లు, కమిటీ సిఫార్సు చేసే ఫిట్మెంట్ వివరాలున్నాయి. అయితే ఇందులో ఈ 70వేల మంది ఉద్యోగుల వివరాలు లేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పీఆర్సీ వర్తించని 70వేల మందిలో టీచర్లు, గురుకుల ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లే అధికంగా ఉన్నారు. ఇందులో డీఎస్సీ- 2024కు చెందిన 10 వేల మంది టీచర్లతోపాటు గురుకుల టీచర్లే ఎక్కువగా ఉన్నారు. వీరితోపాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు, వైద్య సిబ్బంది, గురుకుల టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్లు, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా ఉన్నారు. ఉద్యోగుల జాబితాలో వీరి సంఖ్యను ప్రస్తావించకపోవడంతో వీరికి కొత్త పీఆర్సీ వర్తింపుపై అనిశ్చితి నెలకొన్నది. పీఆర్సీ కమిటీకి ప్రస్తుత ఉద్యోగులే కాకుండా రిటైరైన వారి వివరాలను సైతం సర్కార్ సమర్పించింది. ఇటీవలి కాలంలో రిటైరైన వారిని పెన్షనర్ల జాబితాలో చూపించినట్టు సమాచారం.
పీఆర్సీ కమిటీ సిఫార్సు చేసే ఫిట్మెంట్పై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఏ నలుగురు కలిసినా ఫిట్మెంట్ ఎంతన్న అంశంపైనే చర్చించుకుంటున్నారు. గత పీఆర్సీల్లో కమిటీ సిఫార్సుల కంటే ప్రభుత్వం ఎకువ ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పీకే అగర్వాల్ కమిటీ 27% ఫిట్మెంట్ను సిఫార్సు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ 43% ఫిట్మెంట్ మంజూరుచేసింది. తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ 2020లో 7.5% ఫిట్మెంట్ను మాత్రమే సిఫార్సు చేసింది. అయితే, 2021లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుత పీఆర్సీలో కూడా కమిషన్ సిఫార్సు చేసే ఫిట్మెంట్ ఫైనల్ కాదని.. ప్రభుత్వం, ఉద్యోగ జేఏసీల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఫిట్మెంట్ శాతం పెరిగే అవకాశాలే ఎక్కువున్నాయన్న చర్చ ఉద్యోగుల్లో నడుస్తున్నది.
పీఆర్సీ కమిటీ ఎంత సిఫార్సు చేసినా 30 శాతానికి మించి ఫిట్మెంట్ వర్తింపజేస్తేనే లాభమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నా రు. ఈసారి కమిటీ 10% కంటే తక్కువ ఫిట్మెంట్ సిఫార్సు చేసే అవకాశాలున్నాయని ఉద్యోగుల్లో చర్చ నడుస్తున్నది. ఇది ఆమోదయోగ్యంకాదని, 30 శాతానికి పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రూ.40వేల బేసిక్ పే గల ఉద్యోగికి 30% ఫిట్మెంట్తో రూ.12వేల మేరకు మాత్రమే పెరుగుతుందని, పెరిగిన మార్కెట్ ధరలతో పోల్చితే ఇది దేనికీ సరిపోదని వాదిస్తున్నారు. నిత్యావసర ధరలు, జీవన వ్యయంతో పోల్చితే తకువ ఫిట్మెంట్ వల్ల వాస్తవంగా చేతికందే మొత్తం తగ్గుతుందని అంటున్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సమాన న్యాయం చేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ 70వేల మంది కొత్త ఉద్యోగులకు న్యాయం జరిగేలా సిఫార్సు చేయాలని కోరారు. టీచర్లు, పోలీసు, గ్రూప్స్ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి ఫిట్మెంట్ అందేలా కమిటీ నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.