ధరణికి ప్రత్యామ్నాయమంటూ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి రైతుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు భూభారతి వల్ల తన సమస్య పరిష్కారమైందని చెప్పిన రైతు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఈ పరిస్థితుల్లో భూభారతి డొల్లతనం బయటపడకుండా ఉండేందుకు సర్కార్ ధరణిపై నిందలు మోపే కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మరోసారి ధరణిపై విచారణకు కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పుండొకచోట ఉంటే మందొకచోట పెట్టిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులకు సమస్యాత్మకంగా మారిన భూభారతి బాగోతాలపై విచారణకు ఆదేశించకుండా, ఎప్పుడో బంగాళాఖాతంలో పడేశామని ప్రకటించుకున్న ధరణిపై కమిటీలు వేయాలని నిర్ణయించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. ‘ధరణి’ పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా తీసుకొచ్చిన ‘భూభారతి’ అన్ని అంశాల్లోనూఅట్టర్ఫ్లాప్ అయింది. జనగామలో వెలుగుచూసిన చలాన్ కుంభకోణం మొదలుకొని, తాజాగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారం వరకు ‘భూభారతి’ స్కామ్‌ల నిలయంగా మారింది.
‘భూభారతి పోర్టల్ ఒక్క రోజుల్లో పుట్టలేదు అధ్యక్షా. ఎంతో అధ్యయనం తర్వాతే దీన్ని తీసుకొచ్చాం. మా అధికారులు దేశమంతా తిరిగి 18 రాష్ర్టాల చట్టాలను పరిశీలించి భూభారతి చట్టాన్ని రూపొందించారు. ఎక్కడా ఎలాంటి తప్పులు, స్కామ్‌లు జరుగకుండా అత్యంత పకడ్బందీగా రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాం’- ఇవీ భూభారతి పోర్టల్‌పై శనివారం అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చెప్పిన మాటలు. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా భూభారతి పోర్టల్ స్కామ్‌లకు నిలయంగా మారిందనే ఆరోపణలున్నాయి.
ఇందుకు జనగామ, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో వెలుగుచూసిన చలాన్ స్కామ్‌లను ఉదాహరణగా చూపుతున్నారు. భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలాన్ల చెల్లింపులో మీ-సేవ నిర్వాహకులు భారీ స్కామ్‌కు తెగబడ్డారు. భూభారతి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు. ఈ పోర్టల్ ఆధారంగా చలాన్ నిధులను ప్రభుత్వానికి వెళ్లనివ్వకుండా చేసి వారి జేబుల్లోకి మళ్లించుకున్నారు. గతంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఆ ఒక్క జిల్లాలోనే సుమారు రూ. 52 కోట్లు నొక్కేశారు. ఇలా సుమారు 1,390 డాక్యుమెంట్లకు సంబంధించిన నిధులు నొక్కేసినట్టు విచారణలోనే తేలింది.
భూభారతి పోర్టల్ వేదికగా మరో భారీ కుంభకోణం జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. అసైన్డ్ భూములు పట్టా భూములుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు చుట్టపక్కల జిల్లాల్లో ఇది జోరుగా జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వంలోని బడా నేతలు భూభారతిని అడ్డుపెట్టుకొని అక్రమాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. తద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకరి పేరుపై ఉన్న భూమి మరొకరి పేరుపైకి రిజిస్ట్రేషన్ కావాలంటే, పట్టాదార్ కచ్చితంగా ఆఫీసుకు రావాలి. కానీ, భూభారతిలో భూ యజమాని ఎమ్మార్వో ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు! ఆ వ్యక్తి లేకున్నా, ఆయన భూమి ఇతరుల పేరు మీదికి మారిపోతున్నది. ఇలా వందల సంఖ్యలో భూలావాదేవీలు జరిగినట్టు తెలిసింది. భూమి అమ్మే వ్యక్తి లేకుండానే, ఆ భూమి ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ అవుతున్నదని తెలిసింది. ఇలా సుమారు 9,200 డాక్యుమెంట్లు మారినట్టు తెలిసింది.
తమ అధికారులు 2025 డిసెంబర్ 3న తప్పుడు నివేదిక అప్లోడ్ చేయడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. భూభారతి వేదికగా మరో స్కామ్ జరిగిందని మంత్రి పరోక్షంగా అంగీకరించారనే విమర్శలున్నాయి. తాజాగా తెర మీదికి వచ్చిన 22ఏ నిషేధిత భూముల వివాదం కూడా భూభారతి పోర్టల్ ద్వారానే జరుగడం గమనార్హం. దీని వెనుక కూడా భారీ స్కామ్ దాగి ఉన్నదనే ఆరోపణలున్నాయి.
22ఏ నిషేధిత జాబితా వివాదంతో సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. తప్పులు చేసి తప్పించుకొనే మార్గంలేక కొట్టుమిట్టాడుతున్నది. దీంతో 22ఏ నిషేధిత భూముల వివాదాన్ని, భూభారతి లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు, డైవర్షన్ చేసేందుకు మరోసారి ‘ధరణి’ రాగం ఎత్తుకొనేందుకు నిర్ణయించింది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా మరోసారి ‘ధరణి అక్రమాలపై విచారణ’ పేరిట మరో కమిటీని వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ధరణిలో అక్రమాలను నిగ్గు తేల్చుతామంటూ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే మూడు కమిటీలు వేసింది. ఇప్పటివరకు తేల్చింది ఏమీలేదు. కాగా, భూభారతిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం నోరుమూసుకొని ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా స్కామ్‌లు, వివాదాలు జరుగుతున్నా వాటిపై కనీసం విచారణకు కూడా ఆదేశించడంలేదు.
చలాన్ స్కామ్‌లో తూతూ మంత్రంగా విచారణ జరిపిన ప్రభుత్వం కేవలం మీ-సేవ నిర్వాహకులపై చర్యలతో సరిపెట్టింది. దీనిపై లోతైన విచారణ కోసం సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన 22ఏ నిషేధిత జాబితాపై ప్రభుత్వం ఇప్పటివరకు విచారణకు ఆదేశించకపోవడం, అధికారులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ధరణిని బంగాళాఖాతంలో వేశామని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ, ప్రభుత్వానికి ఇంకా ఆ ఫోబియో పోవడంలేదు. కాంగ్రెస్ సర్కార్ తప్పులు బయటపడ్డప్పుడల్లా ధరణిని ముందు పెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. 22ఏ నిషేధిత భూముల వివాదం నుంచి తప్పించుకొనేందుకు మరోసారి ధరణిని ముందుపెట్టాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే ‘ధరణి అక్రమాలపై విచారణ’ అంటూ మరో కమిటీని వేసేందుకు నిర్ణయించింది. కమిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది. వాస్తవానికి శనివారమే ఈ పని చేయాలని భావించారని, అయితే, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘమైన ప్రసంగంతో సీఎం రేవంత్‌రెడ్డికి ఆ అవకాశం రాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తానే రంగంలోకి దిగి ధరణిపై అక్రమాలను లేవనెత్తి, కమిటీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని సీఎం చెప్పినట్టు తెలిసింది. అందుకే శనివారం ముగించాల్సిన సభను బుధవారానికి పొడిగించారని సమాచారం.
ధరణిపై పలువురు ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కమిటీలో హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లలో ఒకరిద్దరితోపాటు రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, మాజీ కార్యదర్శి నవీన్‌మిట్టల్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి, ప్రభుత్వం ముందుగా మంత్రులతో సబ్ కమటీ వేయాలని నిర్ణయించిందని, అయితే, కమిటీలో ఉండేందుకు మంత్రులెవరూ ముందుకురాలేదని తెలిసింది. దీంతో ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత హౌస్ కమిటీ వేయాలని భావించగా, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలిసింది. దీంతో సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ధరణిని అడ్డుపెట్టుకొని గత ఎన్నికల్లో భూ రాజకీయం చేసిందనే విమర్శలున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక అక్రమాలు నిగ్గుతేల్చుతామంటూ కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేశామని ప్రకటించిన ప్రభుత్వం దీని స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ధరణిపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే మూడు కమిటీలు వేసింది. ఇప్పుడు నాలుగో కమిటీని వేసేందుకు సిద్ధమవుతున్నది.
తొలుత ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐపీఎస్ చారుసిన్హా నేతృత్వంలో జూలై 25న స్పెషల్ ఎంక్వైరీ టీమ్(సెట్) ఏర్పాటు చేసింది. ఇలా ఇప్పటికే ముచ్చటగా మూడు కమిటీలు పూర్తయ్యాయి. ఈ మూడు కమిటీల విచారణలో ధరణిపై లోపాలు, అక్రమాలను ఏమైనా గుర్తించిందా అంటే అదీలేదు.
ఈ మూడు కమిటీల విచారణలోనూ ధరణిలో ఎలాంటి అక్రమాలు జరుగలేదని తేలిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా.. ధరణిపై అదే రకంగా బురజల్లేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కుట్రల్లో భాగంగానే ప్రతిసారీ ధరణిపై ఆరోపణలు చేస్తూ, కమిటీ వేస్తూ ప్రజల దృష్టిలో ధరణిపై వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.