Iran-Israel-US War : విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ శతృవులకు మద్దతుగా నిలిస్తే ఇరాన్‌లోని వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఆదేశాల ప్రకారం.. విదేశాల్లో ఉంటున్న ఇరాన్ పౌరులు ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. శతృవులకు సహకరించడం, మద్దతు తెలపడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాలకు అనుకూలంగా ఉండకూడదు.
ఒకవేళ అలా చేస్తే ఇరాన్‌లోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. శతృవుల చర్యలను సమర్ధించినా, సహకరించినా ఇదే అమలవుతుంది. చట్ట ప్రకారం వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని శతృవులు కింద పరిగణించి, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం తమకు ఉందని వెల్లడించింది. ఇంటెలిజెన్స్, గూఢచర్యం వంటి వాటికి పాల్పడినా ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా ప్రభుత్వాలతో కలిసి పని చేయకూడదని కూడా సూచించింది. మరోవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌లోని రాజధాని టెహ్రాన్ సహా కీలక పట్టణాలు, ప్రభుత్వ సంస్థలు, నిర్మాణాల్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతూనే ఉంది.
అలాగే లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్తావరాలు, నిర్మాణాలపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హెచ్చరించింది. దీంతో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు సూచించింది. అల్ ఖర్ద్ అల్ హసన్ సంస్థకు చెందిన ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌పై భారీ దాడులు చేస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్.. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది.